సుప్రభాత సేవలో శ్రీవారు

సుప్రభాత సేవలో శ్రీవారు
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సుగంధమై అలుముకున్నదే 'శ్రీవారి సుప్రభాతం'. ఒక్క ధనుర్మాసంలో మినహా తిరుమలలో ఉదయం వేళలో సుప్రభాతాన్ని వింటూ పర్వతాలన్నీ పరవశిస్తూ వుంటాయి. తిరుమలలో వున్న ప్రతి ఒక్కరి హృదయం పవిత్రమవుతూ వుంటుంది. ఒక్క తిరుమలలోనే కాదు సుప్రభాతాన్ని ఎక్కడ విన్నా, ఆ ప్రదేశమే పవిత్రమైనదిగా అనిపిస్తూ వుంటుంది ... కనిపిస్తూ వింటుంది.

సాధారణంగా కుటుంబ యజమాని అలసిపోయి పడుకుంటే, అతని కోసం ఎవరైనా వస్తే నిద్రలేపడానికి కుటుంబసభ్యులు సాహసించరు. అత్యవసరమైతే కాస్త మెల్లగా తడుతూ మేల్కొల్పుతారు. అలాంటిది జగాలనేలే జగన్నాథుడు అలసిపోయి పడుకుంటే, ఆయన్ని నిద్రలేపే సాహసం ఎవరు చేస్తారు? ఆ సుందరమూర్తిని నిద్రలేపడం తప్పనిసరైతే ఎంత సున్నితంగా వ్యవహరించాలి? అనే ఆలోచన విజ్ఞులకు కలిగింది.

దాంతో ఏం చేయాలనే విషయమై అంతా తర్జన భర్జన పడసాగారు. తేనెవంటి పదాలతో ... వెన్న వంటి స్వరంతో ... ఆలాపన ద్వారానే బంగారు తండ్రిని నిద్రలేపడం మంచిదనే ఆలోచనతో 'ప్రతివాద భయంకర అణ్ణంగాచార్యులు' సుప్రభాత రచన చేశారు. మనవాళ్ల మహామునుల్లో ఒకరైన ఆయన సుప్రభాత రచన పట్ల ఆనాటి పండితులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అలా స్వామివారి సన్నిధిలోకి ... ఆయన భక్తుల హృదయాల్లోకి సుప్రభాతం ప్రవేశించింది.

''కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే'' అంటూ మొదలయ్యే ఈ సుప్రభాతం సుకుమారుడైన స్వామివారిని సున్నితంగా ఈ లోకంలోకి తీసుకువస్తుంది. భక్తుల ఆవేదనను సహనంతో వినే ప్రశాంతతను ఆయనకి ప్రసాదిస్తుంది. ప్రతి రోజు వేకువ జామునే సన్నిధి గొల్లతో కలిసి ఆలయ అర్చకులు ... జియ్యంగారులు ... ఏకాంగులు ఆలయానికి చేరుకుంటారు. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల నడుస్తుండగా మిగతావాళ్లు ఆయనను మౌనంగా అనుసరిస్తారు.

ధ్వజస్తంభం దగ్గర గల క్షేత్రపాలక శిల ( శివుడు)కు తాళపు చెవులను తాకిస్తారు. అలా శివుడి అనుమతి తీసుకుని బంగారు వాకిలిలోకి ప్రవేశిస్తారు. అర్చకులు ఎదురెదురుగా రెండు వరుసలలో నుంచుని సుప్రభాతాన్ని పఠిస్తారు. ఈలోగా అన్నమాచార్య వంశీకులొకరు ఆనంద నిలయంలోకి ప్రవేశించి స్వామివారిని మేల్కొల్పుతారు. అర్చకులు లొకలికి వెళ్లి స్వామివారి పాదాలకు నమస్కరిస్తారు.

స్వామికి అడ్డుగా తెర వుంచి వెన్న - పాలు నైవేద్యంగా సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తి కాగానే కర్పూర హారతిని ఇస్తారు. దాంతో సుప్రభాత సేవ పూర్తి అవుతుంది. అప్పటి నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించడం జరుగుతుంది.

More Bhakti Articles