కష్టాలను కడతేర్చే సాయి దేవుడు

కష్టాలను కడతేర్చే సాయి దేవుడు
ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తరిలా వుండదు. ఎవరి పరిధిలో వారికి ... ఎవరి స్థాయిలో వారికి కష్టాలు ఉంటూనే వుంటాయి. కాకపోతే ఒకరి జీవితం ఒకరికి హాయిగా సాగిపోతున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. నిజానికి కష్టాలు ఎప్పుడూ వుంటూనే వుంటాయి. సుఖాలు మాత్రమే అప్పుడప్పుడు వచ్చి వెళుతూ వుంటాయి.

అలా కష్టాలు ఎదురైనప్పుడు ... సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు తీరానికి చేర్చే ఆపద్బాంధవుడే సాయినాథుడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. అందుకే అనేక రకాల సమస్యలతో సతమతమైపోయేవాళ్లు ఆయన ఎదురుగా కూర్చుని కన్నీటి ధారలతో తమ ఆవేదనను ఆవిష్కరిస్తూ వుంటారు. ఆయన చల్లని చూపుల్లో తడుస్తూ ఉపశమనాన్ని పొందుతూ వుంటారు.

అలా ఎంతో మంది భక్తుల నమ్మకాన్ని చూరగొన్న సాయినాథుడి క్షేత్రం నల్గొండ జిల్లా కోదాడలోని ఆజాద్ నగర్ లో దర్శనమిస్తుంది. సాయినాథుడి లీలలు అనుభవంలోకి వచ్చిన వారి సహాయ సహకారాలతో చాలాకాలం క్రితమే ఈ ఆలయం నిర్మించబడింది. విశాలమైన మంటపం కలిగిన ఈ ఆలయంలో వేదికపై వెన్నెల రాజులా సాయినాథుడు చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తాడు. ఆ పక్కనే సాయి అభిషేకానికి అవసరమైన పాలను అందించే గోశాల కనిపిస్తుంది. ఈ గోశాలలో కొలువుదీరిన కృష్ణుడు మనసు దోచుకుంటూ వుంటాడు.

ప్రతి గురువారం శిరిడీలో మాదిరిగానే ఇక్కడ అలంకరణలు ... హారతులు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. ఇక్కడి సాయినాథుడిని దర్శించడం వలన సకలశుభాలు చేకూరతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. సాయి నామాన్ని జపిస్తూ ... సాయి భజనలు చేస్తూ ... సదా సాయి సేవలో తరిస్తుంటారు.

More Bhakti Articles