సరస్సుగా మారిన సీతమ్మతల్లి కన్నీరు

సరస్సుగా మారిన సీతమ్మతల్లి కన్నీరు
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని రామాయణం ఎంతగానో ప్రభావితం చేసింది. రామాయణం చదవని వాళ్లు ఉంటారేమోగానీ, వినని వాళ్లు మాత్రం ఉండరు. ఈ కారణంగానే సీతారాముల పట్ల అందరూ ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తుంటారు. వారు నడయాడిన ప్రదేశాలు పవిత్రమైనవిగా భావించి, కళ్లకి అద్దుకుంటూ వుంటారు.

అలాంటి వారితో ''సీతమ్మ ఈ ప్రదేశంలో కూర్చుని ఏడిచిందట'' అని చెబితే, పరిగెత్తుకు వచ్చి ఆ ప్రదేశాన్ని కళ్లకి అద్దుకుంటారు ... కన్నీళ్ల పర్యంతమవుతారు. సీతమ్మ కన్నీరు గురించి విన్న ఏ స్త్రీ కూడా ఈ లోకంలో దుఃఖాన్ని ఆపుకోలేదు. సీతమ్మ తల్లితో వాళ్లకి అంతటి అనుబంధం వుంటుంది. అలాంటి సీతమ్మ తల్లిని రావణుడు అపహరించి బంధించిన ప్రదేశం మనకి శ్రీలంకలో కనిపిస్తుంది.

సీతమ్మవారిని రావణుడు ఉంచిన ఆ ప్రదేశాన్ని 'సీత కటువ' అని అంటారు. అక్కడ సీతమ్మతల్లి విలపించగా ఆమె కన్నీరును భూదేవి ఇమిడ్చుకోగపోగా, ఆ కన్నీటితో ఈ ప్రదేశంలో ఓ సరస్సు ఏర్పడిందని అంటారు. ఎంతటి వేసవి కాలమైనా ఈ సరస్సులోని నీరు కొంచెం కూడా తగ్గక పోవడాన్ని గురించి విశేషంగా చెబుతారు.

సీత కన్నీటితో ఏర్పడిన ఆ సరస్సును చూడగానే, ఆ తల్లి అంతగా తన కోసం ఏడుస్తుందని తెలిసే శ్రీరాముడు ఆమెని చేరుకోవడానికి అన్ని కష్టాలు పడ్డాడేమోనని అనిపిస్తుంది. లోకానికే ఆదర్శప్రాయమైన ఆ అన్యోన్య దంపతులకు కలిగిన ఎడబాటును తలచుకుంటే ఒక్కసారిగా మనసు భారమవుతుంది. ఈ ప్రదేశానికి గల విశిష్టత వెలుగులోకి వచ్చినప్పుడే ఇక్కడ సీతారాముల ఆలయాన్ని నిర్మించారు.

ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించని కోతులు ఈ ఆలయంలో విపరీతంగా వుండటం, ఇక్కడి స్థల పురాణానికి మరింత బలాన్నిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని దర్శించిన వాళ్లు అక్కడి నేలను ఆప్యాయంగా స్పర్శిస్తారు. అక్కడి నేలకి తలని తాకిస్తూ సీతమ్మవారి ఆశీస్సులను అందుకున్నట్టుగా భావిస్తారు. అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మాత్రం అమ్మవారిని తీసుకురాకుండా అక్కడే వదిలేసి వస్తున్నామేమో అనే భావనతో ప్రతి ఒక్కరి కళ్లు కన్నీటి సరస్సులవుతాయి.

More Bhakti Articles