లక్ష్మీదేవి కొలువైన బంగారు ఆలయం

లక్ష్మీదేవి కొలువైన బంగారు ఆలయం
సంపద ... సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. ఆ గౌరవం వలన ఆనందం కలుగుతుంది. ఆనందం ... ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. ఆత్మ విశ్వాసం వలన అనేక విజయాలు సొంతమవుతాయి. అందుకే అందరూ సంపదను పెంచుకోవడానికి తమ స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంటారు. సంపదలను అనుగ్రహించే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు.

అందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని మరింత వైభవంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ భక్తుడు చేసిన ప్రయత్నం కారణంగా ఆ తల్లికి బంగారు ఆలయం నిర్మించబడింది. తమిళనాడు - వేలూరు సమీపంలో ఒకప్పుడు 'తిరుమలై కోడి' గా ... ఇప్పుడు 'శ్రీపురం' గా పిలవబడుతోన్న ప్రాంతంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాల నడుమ, నక్షత్రాకారం గల ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణానికి గాను 1500 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. 400 మంది శిల్పులు 6 సంవత్సరాల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. అపూర్వమైన ఈ ఆలయ నిర్మాణానికి అనేక మంది దాతలు తమ సహాయ సహకారాలను అందించారు. బాల్యం నుంచి అమ్మవారిని ఆరాధించే ఓ భక్తుడు 'శక్తి అమ్మ'గా తన పేరును మార్చుకుని ఈ ఆలయ నిర్మాణానికి నడుం బిగించాడు.

ఇక్కడి అమ్మవారిని 'శ్రీలక్ష్మీ నారాయణి' గా భక్తులు పూజిస్తూ వుంటారు. వందలాది మంది భక్తులు వచ్చినా ఆలయ ప్రశాంతతకు భంగం వాటిల్లదు. ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించినది మొదలు తిరిగి వచ్చేంత వరకూ అందరూ మౌనాన్ని పాటించాలనే నియమం వుంది. ఆర్ధికపరమైన ... అధికారపరమైన అర్హతల ఆధారంగా ఇక్కడ దర్శనాలు వుండవు. అందరూ ఒకే వరుసలో వెళ్లి ఆ తల్లి దర్శనం చేసుకోవలసిందే. ఏడు ద్వారాలను దాటుకుని వెళ్లి అమ్మవారిని దర్శించడం ప్రతి ఒక్కరికి ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles