లంకె బిందెలతో నిర్మించిన ఆలయం
భగవంతుడు తన భక్తులకు కలలో కనిపించి తన ఉనికిని తెలియజేయడమే కాకుండా, తన ఆలయ నిర్మాణానికి అవసరమైన శక్తిని ఆ భక్తులకు కల్పించిన వైనం మనకి అనేక క్షేత్రాల్లో కనిపిస్తూ వుంటుంది. అలాంటి ఆసక్తికరమైన సంఘటన జరిగిన క్షేత్రం మనకి గుటూరు జిల్లా 'యనమదల'లో కనిపిస్తుంది. పూర్వం ఒక భక్తుడు తన గ్రామంలో వీరభద్రస్వామి మందిరం నిర్మించాలని అనుకున్నాడు. అందుకు అవసరమైన స్వామివారి విగ్రహాన్ని ... నంది విగ్రహాన్ని ఒకచోట చెక్కించి దున్నపోతుల బండిపై తన గ్రామానికి బయలుదేరతాడు.
కొంతదూరం వెళ్లాక ఎండవేడికి తాళలేక చెరువు పక్కనే గల ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటాడు. అలా నిద్రలోకి జారుకున్న ఆయనకి కలలో వీరభద్రుడు కనిపిస్తాడు. తనకి ఆ ప్రదేశం బాగా నచ్చిందనీ ... తనకి అక్కడే ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు. తన గ్రామంలో తాను చిన్న మందిరం నిర్మించాలనుకున్నాననీ, ఆలయాన్ని కట్టించే ఆర్ధికపరమైన శక్తి తనకి లేదని ఆ భక్తుడు అంటాడు. అయితే నీళ్లు తాగడానికి దున్నపోతులను చెరువు దగ్గర వదలమనీ, ఆ విధంగా చేయడం వలన సమస్య పరిష్కారం అవుతుందని వీరభద్రుడు చెబుతాడు.
మెలకువ వచ్చాక ఆ భక్తుడికి తనకి వచ్చిన కలను నమ్మాలో లేదో తెలియలేదు. దున్నపోతులను వదిలి చూద్దామనే ఉద్దేశంతో వాటి తాళ్లను విప్పుతాడు. చెరువులోకి దిగిన దున్నపోతులు కొంతసేపటికి గట్టుపైకి చేరుకున్నాయి. వాటి కొమ్ములకి తగులుకున్న తాళ్లతో సహా 'లంకెబిందెలు' రావడం చూసి ఆ భక్తుడు ఆనందాశ్చర్యాలకి లోనవుతాడు. తనకి వచ్చినది కలకాదనీ ... స్వామి సందేశమని ఆ భక్తుడు భావిస్తాడు. గ్రామస్తులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి, ఆ సొమ్ముతో ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తాడు.
అలా 14 వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ తన విశిష్టతను చాటుకుంటోంది. తన ఆలయాన్ని తానే నిర్మింపజేసుకున్నాడు కనుక ఇక్కడి స్వామి మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఈ స్వామిని పూజించడం వలన ఆశించిన ఫలితాలు అనతికాలంలోనే దక్కుతాయని చెబుతుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనని ఆరాధిస్తూ తరిస్తుంటారు.