పరమశివుడికి ఇష్టమైన పుష్కరిణి

పరమశివుడికి ఇష్టమైన పుష్కరిణి
వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ గల పుష్కరిణిల విశిష్టత గురించి తెలుస్తూ వుంటుంది. ఆ క్షేత్రంలో ఆవిర్భవించిన దైవానికి ... అక్కడ ఏర్పడిన పుష్కరిణికి గల సంబంధం గురించి స్థలపురాణం చెబుతూ వుంటుంది. కొన్ని క్షేత్రాల్లో సాక్షాత్తు అక్కడ కొలువైన దైవమే పుష్కరిణిని ఏర్పాటుచేసినట్టు చెబుతుంటారు. ఇలాంటి పుష్కరిణిలతో ఆ దైవాలకి గల సంబంధం ఎలా ఉంటుందనేది పశ్చిమ గోదావరి జిల్లా 'యనమదుర్రు' క్షేత్రాన్ని దర్శించినప్పుడు తెలుస్తుంది.

ప్రాచీనకాలం నుంచి ఇక్కడ 'శక్తిగుండం' అనే ఓ పుష్కరిణి వుంది. ఆనాటి నుంచి కూడా స్వామివారి అభిషేక జలాలకి ... నైవేద్యాలకి ఇందులోని నీటినే ఉపయోగిస్తూ వస్తున్నారు. ఒకసారి ఈ పుష్కరిణి పూడిక తీయవలసి వచ్చిందట. దాంతో గ్రామస్తులు ఈ పుష్కరిణి నీటిని బయటికి తోడేసి పూడిక తీయడం ప్రారంభించారు. ఆ సమయంలో స్వామివారి నైవేద్యానికి అవసరమైన నీటిని వేరేచోటు నుంచి తెచ్చారు. పదార్థాలేవీ ఉడకక పోవడంతో మరోచోటు నుంచి నీళ్లు తెచ్చారు.

ఇలా రెండు మూడు చోట్లనుంచి నీళ్లు తెచ్చినా ప్రయోజనం లేకుండాపోవడంతో అది స్వామివారి మహిమ అనే విషయం వాళ్లకి బోధపడుతుంది. స్వామివారికి ఆ పుష్కరిణిలోని నీళ్లు అంటే ఎంత ఇష్టమో వాళ్లకి అర్థమవుతుంది. పూడిక తీస్తోన్న ఆ పుష్కరిణిలోనే ఓ వైపున చిన్నగుంట తీశారు. అందులోకి నీళ్లు ఊరగానే ఆ నీటిని తెచ్చి నైవేద్యాన్ని సిద్ధం చేశారు. ఎప్పటిలానే స్వామివారికి నైవేద్యం తయారైంది.

ఇది మహిమాన్వితమైన పుష్కరిణి అనీ ... ఇందులోని నీళ్లంటే స్వామివారికి పాణమనే విషయం ఆ రోజుతో మరోమారు స్పష్టమైంది. ఆ రోజు నుంచి స్వామివారి నైవేద్యానికి అవసరమైన నీటి కోసం మరోచోట వెదికే పరిస్థితి రాకుండా గ్రామస్తులు జాగ్రత్తపడుతూ వస్తున్నారు. స్వామివారి మనసు దోచుకున్న ఆ పుష్కరిణిని అపురూపంగా చూసుకుంటున్నారు.

More Bhakti Articles