భక్తులను అవమానిస్తే కలిగే ఫలితం ?

భక్తులను అవమానిస్తే కలిగే ఫలితం ?
పూర్వం కాశీ క్షేత్రంలో శర్వానందుడు అనే పండితుడు ఉండేవాడు. వివిధ శాస్త్రాలను అభ్యసించిన ఆయన, అనేక ప్రాంతాలను దర్శిస్తూ అక్కడి పండితులను వాదనలో ఓడిస్తూ జయపత్రాలను తీసుకోసాగాడు. ఆ జయపత్రాలను ఆయన తన తల్లికి చూపించి, శాస్త్రపరమైన వాదనలో తనకి తిరుగులేదని చెబుతాడు. తన కొడుకులో విద్యాగర్వం తలెత్తిందని గ్రహించిన తల్లి, వాదనలో కబీరుదాసును ఓడించమని చెబుతుంది.

శర్వానందుడు వెంటనే కబీరుదాసుని కలుసుకుని వివిధ శాస్త్రాల్లో తనకి గల పాండిత్యాన్ని గురించి ప్రస్తావిస్తాడు. ఆయన గొప్పతనం గురించి విన్నాననీ ... అందువలన శాస్త్రపరమైన వాదన చేయడానికి వచ్చానని చెబుతాడు. తాను పెద్దగా చదువుకోలేదనీ ... భగవంతుడిని విశ్వసించడం తప్ప తనకి మరేమీ తెలియదని చెబుతాడు కబీరు. అయితే తన విజయాన్ని అంగీకరిస్తూ జయపత్రం రాసి ఇవ్వమని కోరతాడు శర్వానందుడు.

శాస్త్ర పరంగా సాగిన వాదనలో తాను ఒడి పోయినట్టుగా ... శర్వానందుడు గెలిచినట్టుగా జయపత్రాన్ని రాయించి ఇస్తాడు కబీరు. ఆ పత్రాన్ని తీసుకువెళ్లి గర్వంగా తల్లికి చూపిస్తాడు శర్వానందుడు. అయితే అందులో కబీరు గెలిచినట్టుగా ... శర్వానందుడు ఓడినట్టుగా వుంటుంది. అది చూసి శర్వానందుడు ఆశ్చర్యపోతాడు. ఎక్కడో పొరపాటు జరిగిందని భావించి మళ్లీ కబీరు దగ్గరికి వెళ్లి మరో జయపత్రం రాయించి తీసుకు వస్తాడు.

ఇంటికి వచ్చాక చూస్తే అందులోనూ అలాగే వుంటుంది. కబీరును అవమానపరచాలని చూస్తే ఆయన నమ్మిన రాముడు చూస్తూ ఊరుకోడని శర్వానందుడి తల్లి చెబుతుంది. అహంకారం నశించిన చోట మాత్రమే భగవంతుడు ఉంటాడనీ, నిజమైన భక్తులే అసలైన పండితులని ఆమె హితవు చెబుతుంది. అజ్ఞానం పటాపంచలు కావడంతో శర్వానందుడు నేరుగా కబీరు చెంతకి వెళ్లి, తనని మన్నించమంటూ ఆయన పాదాలకి నమస్కరిస్తాడు.

More Bhakti Articles