అనఘాష్టమీ వ్రతం

అనఘాష్టమీ వ్రతం
పరాక్రమాన్ని కోరే వారికి 'అనఘాష్టమీ వ్రతం' చెప్పబడింది. అనఘుడు అంటే దత్తాత్రేయుడు ... అనఘుడు భార్య అనఘాదేవి. అష్ట సిద్ధులూ వీరి సంతానం. వీరి శిష్యుడే కార్త వీర్యార్జునుడు. ఈ వ్రతాన్ని ఆచరించి మహా బలశాలిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమే కాకుండా, ఈ వ్రతానికి విస్తృతమైన పరిధిలో ప్రచారాన్ని కల్పించాడు. ఇక స్త్రీలు - పురుషులు కూడా ఈ వ్రతాన్ని చేసుకునే అవకాశం వుండటం విశేషంగా చెప్పుకోవాలి.

ప్రతి సంవత్సరం 'మార్గశిర బహుళ అష్టమి' రోజున అనఘా దంపతులనూ ... అష్ట సిద్ధుల ప్రతిమలను దర్భలతో చేసి పీఠంపై ప్రతిష్ఠించాలి. ఆ తరువాత కలశస్థాపన చేసి ... శాస్త్రోక్తంగా పూజ చేయాలి. పిండి వంటలతో పాటు వివిధ రకాల పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ఇక పాండవులు అరణ్యవాసం చేస్తోన్న సమయంలో ఈ వ్రతాన్ని గురించి శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగా తెలుస్తోంది.

అనఘుడు - అనఘాదేవిల పట్ల కార్తవీర్యార్జునుడు ఎంతో భక్తి శ్రద్ధలను కలిగిఉండేవాడు. ఆదర్శవంతమైన శిష్యుడిగా వారి ప్రేమాభిమానాలకు పాత్రుడయ్యాడు. గురువు పట్ల ఉన్న అచెంచలమైన విశ్వాసం కారణంగా అనఘా వ్రతాన్ని ఆచరించి వెయ్యి చేతులను పొందాడు. తన పరాక్రమంతో తిరుగులేని విధంగా ప్రజలను పరిపాలించాడు. తన రాజ్యం సిరిసంపదలకు ... సుఖ శాంతులకు నిలయమని అందరూ చెప్పుకునేలా చేశాడు.

మహా బలవంతుడైన రావణాసురిడిని సైతం కార్తవీర్యార్జునుడు అవలీలగా ఓడించి, ఆ తరువాత క్షమించి వదిలేశాడు. అందువలన అంతటి ఆరోగ్యాన్ని ... పరాక్రమాన్ని ప్రసాదించే ఆ వ్రతం చేసుకోమని కృష్ణుడు సూచించగా, పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ... దీని యొక్క మహిమను మరొకరికి చెప్పడం నియమంగా వస్తోంది.

More Bhakti Articles