ధనవంతులను చేసే ధనలక్ష్మీ క్షేత్రం

ధనవంతులను చేసే ధనలక్ష్మీ క్షేత్రం
దేవాలయం ఏదైనా అక్కడికి వెళ్లిన భక్తులు తమ జీవితం సంతోషంగా ... సంతృప్తికరంగా కొనసాగాలనే కోరుకుంటారు. వాళ్లు ఆశించిన విధంగా జీవితం ఉండాలంటే అందుకు ధనం తప్పని సరిగా అవసరమవుతుంది. విలాసాల విషయం పక్కనపెడితే ధనం అవసరాలను తీరుస్తుంది ... ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది ... అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. అందుకే అందరూ ధనానికి అంతటి ప్రాధాన్యతను ఇస్తుంటారు ... ధనలక్ష్మీ అనుగ్రహం కోసం ఆరాటపడుతూ వుంటారు.

సాధారణంగా ధనలక్ష్మీ అమ్మవారు అష్టలక్ష్మీ ఆలయంలో దర్శమిస్తూ వుంటుంది. అలా కాకుండా అమ్మవారు ప్రత్యేకంగా కొలువుదీరిన ఆలయం సికింద్రాబాద్ లో కనిపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారు పద్మంలో కూర్చుని దర్శనమిస్తూ వుంటుంది. రెండు చేతుల్లో పద్మాలను ధరించి ... అభయ వరద హస్తాలతో భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.

చక్కని కనుముక్కు తీరుతో కళకళలాడుతూ కనిపించే ఇక్కడి అమ్మవారిని చూసితీరవలసిందే. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతుంటాయి. ఇక్కడి అమ్మవారిని అనునిత్యం ఆరాధిస్తే ఆర్ధికపరమైన ఇబ్బందులు దరిచేరవని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక ఈ ఆలయంలో మరో భాగంగా శిరిడీ సాయిబాబా ఆలయం కనిపిస్తుంది.

ఆలయంలోకి అడుగుపెట్టగానే బాబా జీవిత విశేషాలు వర్ణ చిత్రపటాల రూపంలో దర్శనమిస్తాయి. బాబా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను శిల్పాలతో కూడిన దృశ్యాలుగా మలిచి ఆవిష్కరించిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే సాయి సన్నిధికే కాదు ... సాయి కాలానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. కరుణ కురిపించే సాయిబాబా ... కాసులు కురిపించే అమ్మవారు ఒకే ప్రాంగణంలో కొలువుదీరి వుండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు.

More Bhakti Articles