దైవానికి సాధ్యంకానిది ఉంటుందా ?

దైవానికి సాధ్యంకానిది ఉంటుందా ?
ఆదిశంకరుల వారు తన శిష్యబృందంతో కలిసి అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఓ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి దైవాన్ని దర్శించుకుని కాసేపు మంటపంలో కూర్చున్నారు. శంకరుల వారి గురించి గొప్పగా విని వుండటం వలన గ్రామస్తులంతా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. శంకరుల వారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకోసాగారు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ కుష్ఠు వ్యాధి గ్రస్తుడు అతికష్టం మీద అక్కడికి వస్తాడు.

శరీరమంతటా పుండ్లు పడి .. వాటి నుంచి విపరీతమైన దుర్గంధం రాసాగింది. ఆ దుర్గంధాన్ని భరించలేక అక్కడున్న వాళ్లంతా దూరంగా జరిగారు. తనకి దూరంగా వెళ్లిన గ్రామస్తులను ... తన దగ్గరికి వస్తోన్న కుష్ఠు వ్యాధిగ్రస్తుడిని శంకరులవారు చూశారు. చేతుల సాయంతో నేలపై దేకుతూ స్వామివారిని సమీపించిన వ్యాధిగ్రస్తుడు, ఒక్కసారిగా బావురుమని ఏడుస్తూ స్వామివారి పాదాలచెంత శిరస్సును ఉంచాడు.

తాను చేసిన పాపాలు వ్యాధి రూపంలో పట్టిపీడిస్తూ ఉన్నాయనీ ... పశ్చాత్తాపం చెందినా పాపఫలితం మాత్రం పలచన కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తాడు. భరించలేకపోతోన్న ఈ బాధనుంచి తనకి విముక్తి కల్పించమంటూ ప్రాధేయపడతాడు. శంకరులవారు ఏం చేస్తారా అని గ్రామస్తులంతా ఆసక్తిగా ఎదురుచూడసాగారు. వ్యాధిగ్రస్తుడి ఆవేదనను అర్ధం చేసుకున్న శంకరులవారు ఆప్యాయంగా అతణ్ణి స్పర్శించారు.

అంతే .. మరుక్షణమే అతని వ్యాధి మాయమై, ఆరోగ్యవంతమైన దేహంతో మెరిసిపోసాగాడు. అతనితోపాటు ఆ దృశ్యాన్ని చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోతారు. శంకరులవారి అనుగ్రహానికి మించిన ఔషధం లేదనే సత్యాన్ని వాళ్లు గ్రహిస్తారు ... స్వామివారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. శంకరులవారి అనుగ్రహానికి నోచుకున్న ఆ వ్యక్తి, స్వామివారి అనుమతితో ఆయన శిష్యగణంలో చేరిపోతాడు.

More Bhakti Articles