దారిద్ర్యాన్ని నివారించే అమ్మవారి దర్శనం

 దారిద్ర్యాన్ని నివారించే అమ్మవారి దర్శనం
దారిద్ర్యం ... సమస్యల సుడిగుండం నుంచి బయటపడనీయకుండా చేసి సమస్త సంతోషాలకు దూరంగా ఉంచుతూ వుంటుంది. అలాంటి దారిద్ర్యం నుంచి విముక్తి పొందడానికి ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నం తాము చేస్తూనే, తమని ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించమని దేవతారాధన చేస్తుంటారు. అలాంటివారికి అండగా నిలిచి అనుగ్రహించే అమ్మవారిగా 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ' కనిపిస్తుంది.

అమ్మవారిని అంకితభావంతో సేవించిన వారికి దారిద్ర్యం ... దాని కారణంగా కలిగే దుఖం నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే వివిధ ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాల నిర్మాణాలు ... ఆరాధనలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలువుదీరిన అమ్మవారు మనకి మహబూబ్ నగర్ లో దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారు మహిమాన్వితమైనదనీ ... ఆ తల్లిని సేవించడం వలన ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని అంటారు.

దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఒక్కోరోజున ఒక్కో రూపంగా కొలుస్తూ వుంటారు. ఈ సందర్భంగా వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి చేసే 'శాకాంబరి' అలంకరణ చూసి తీరవలసిందే. ఇక ఈ ప్రాంగణంలో నగరేశ్వరుడుతో పాటు సీతారాములు ... రాధాకృష్ణులు ... హనుమంతుడు పూజలు అందుకుంటూ వుంటారు.

More Bhakti Articles