భక్తుడికి సేవలు చేసిన హనుమంతుడు

 భక్తుడికి సేవలు చేసిన హనుమంతుడు
భక్తుల సేవలను స్వీకరించడమే కాదు ... అవసరమైతే ఆ భక్తులకు సేవ చేయడానికి కూడా భగవంతుడు వెనుకాడాడు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు వున్నాయి. అయితే అంతలా భగవంతుడి మనసును ఆకట్టుకోవడమే కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి తాను నమ్మిన దైవం అనుగ్రహాన్ని పొందిన వారిలో 'మధ్వమహర్షి' ఒకరు. ఆయన హనుమంతుడి భక్తుడు. నిరంతరం హనుమంతుడిని ధ్యానిస్తూ ఉండేవాడు.

ప్రశాంతమైన వాతావరణంలో మధ్వమహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, హనుమంతుడిని సేవిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. స్వామి సేవలోనే ఆయనకి వృద్ధాప్యం వచ్చింది. ఒకసారి ఆయన స్నానానికి వెళ్లి, నీరసం కారణంగా నీటిలో పడిపోయాడు. అదే సమయంలో ఒక పెద్ద కోతి వచ్చి ఆయనని కాపాడింది. అదే ఆయనని ఆశ్రమానికి చేర్చి సపర్యలు చేయసాగింది.

ప్రతి నిత్యం ఆ కోతి ఆయనకి ఒక రుచికరమైన ఫలాన్ని ఇస్తూ వుండేది. ఆ ఫలాన్ని తినగానే ఆయన ఆకలి తీరిపోయేది. ఇలా కొన్నిరోజులపాటు జరిగాక మధ్వ మహర్షి కాస్త కోలుకున్నాడు. అప్పుడు కూడా ఆయనకి ఏం కావాలనేది గ్రహించి, ఆ పనులను ఆ కోతి పూర్తిచేసి పెట్టేది. అలా మధ్వమహర్షి పూర్తిగా కోలుకునేంత వరకూ, ఆ కోతి అన్నిరకాలుగా ఆయనకి సేవలు చేసింది.

ఆ కోతి సాక్షాత్తు హనుమంతుడేననే విషయం మహర్షి గ్రహించాడు. తన దైవంతో సేవలు చేయింకున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు హనుమంతుడు తన నిజరూపాన్ని ఆయనకి చూపించాడు. భక్తుడికి సేవచేయడంలో భగవంతుడికి కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిదని అంటాడు. త్వరలో మహర్షి అక్కడ మద్ది చెట్టుగా అవతరిస్తాడనీ ... ఆ చెట్టు నీడలో తాను ఆవిర్భవిస్తానని చెబుతాడు.

ఈ నేపథ్యంలో విలసిల్లుతున్నదే పశ్చిమ గోదావరి జిల్లాలోని 'శ్రీ మద్ది ఆంజనేయస్వామి' క్షేత్రం. మధ్వమహర్షికి హనుమంతుడు రోజుకో ఫలాన్ని ఇచ్చాడనడానికి నిదర్శనంగా ఇక్కడ చేతిలో ఫలంతో స్వామి దర్శనమిస్తూ వుండటం విశేషం. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని నిత్యం ఎంతోమంది భక్తులు దర్శించి తరిస్తుంటారు.

More Bhakti Articles