శ్రీ వైభవలక్ష్మీ వ్రతం

శ్రీ వైభవలక్ష్మీ వ్రతం
జీవితం వైభవంగా వెలుగొందాలంటే 'వైభవలక్ష్మీ' అనుగ్రహం ఉండాలి. ఆమె దయే లేకపోతే ఎంతటి వారికైనా పరాభవం ... పతనం తప్పవు. ఈ వ్రతానికి మూలమైన కథ కూడా ఇదే విషయాన్ని చాటి చెబుతోంది. ఇక ఈ వ్రతం చేయాలనుకున్న వారు శుక్రవారం రోజున తల స్నానం చేసి తన సంకల్పం నెరవేరేలా చూడమంటూ అమ్మవారికి నమస్కరించాలి. ఆ రోజున సూర్యాస్తమయం వరకూ ఉపవాసం వుండి, ఆ తరువాత తూర్పూ లేదా ఈశాన్య దిశలో మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

ఇక పీఠంపై ముగ్గుపెట్టి .. కొత్త వస్త్రం వేసి బియ్యం పోయాలి. దానిపై రాగి కలశాన్ని పెట్టి అందులో ఒక రూపాయి నాణెం ఉంచాలి. నేతితో దీపం వెలిగించి ధూపం చూపించాలి. ముందుగా గణపతినీ ... శ్రీ చక్రాన్ని పూజించిన తరువాతే వైభవలక్ష్మిని పూజించాలి. ఆ తరువాత కలశంలో ఉంచిన రూపాయ నాణెంను తీసి భద్రపరచాలి. కలశంలోని జలాన్ని దంపతులు తీర్థంగా తీసుకోవాలి. ఇక ఈ వ్రతానికి సంబంధించి ఈ కథ ప్రచారంలో ఉంది.

పూర్వం ఒక ఊరులో వైభవలక్ష్మీ భక్తులైన నలుగురు అక్కచెల్లెళ్లు వుండేవాళ్లు. అమ్మవారి అనుగ్రహం కారణంగా వారి భర్తలు ఆయా రంగాల్లో రాణించి శ్రీమంతులయ్యారు. అయితే కష్టాలు వచ్చినప్పుడే తప్ప కాసులు వచ్చినప్పుడు దైవం గుర్తుకురాదనే విషయం వీరి విషయంలోనూ నిజమైంది. అక్కా చెల్లెళ్ల భర్తలందరూ కూడా తాము సాధించిన విజయాలకు తాము మాత్రమే కారణమంటూ దైవాన్ని నిర్లక్ష్యం చేశారు. అదంతా అమ్మవారి అనుగ్రహమేనని తమ భర్తలకు చెప్పి వాళ్లని భార్యలు సరైన మార్గంలో నడిపించలేక పోయారు. ఫలితంగా అందరూ ఎంత వేగంగా ఎదిగారో ... అంతే వేగంగా పతనమయ్యారు.

దాంతో గత వైభవాన్ని తలచుకుంటూ అక్కాచెల్లెళ్ళంతా కన్నీళ్ల పర్యంతమయ్యారు. వారి కన్నీళ్లకి కరిగిపోయిన వైభవలక్ష్మీ ఓ వృద్ధురాలి వేషంలో వారి దగ్గరికి వచ్చింది. పరిస్థితులన్నీ చక్కబడాలంటే వైభవలక్ష్మీ వ్రతం చేయమంటూ విధి విధానాలను వివరించింది. ఆమె చెప్పినట్టుగానే అక్కాచెల్లెళ్ళంతా వారి వారి గృహాలలో వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. వారి భర్తలు కూడా ఆ వ్రతంలో పాలుపంచుకున్నారు. దాంతో అనతి కాలంలోనే తిరిగి వారు పూర్వ వైభవాన్ని పొందారు.

More Bhakti Articles