శ్రీవారి తిరునామం విశేషం

శ్రీవారి తిరునామం విశేషం
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగానే మనసు పరవశానికి లోనవుతుంది. స్వామివారి మూర్తి నిండుగా అనేక రకాల ఆభరణాలు ... వివిధ రకాల పూలమాలికలు కలిగి ఉన్నప్పటికీ ప్రధానంగా ఆకర్షించేది ఆయన తిరునామమేనని చెప్పక తప్పదు. వైఖానస సంప్రదాయం ప్రకారం నాశిక పై భాగం నుంచి నుదుటి పై భాగం వరకూ ఈ నామం అలంకరించబడి వుంటుంది.

కలువల వంటి స్వామివారి కనులకు తాకుతూ నుదుటి మధ్యలో పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం, ఆయన ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ వుంటుంది. అందగాడైన శ్రీవారికి మరింత అందాన్ని తెచ్చే ఈ నామాన్ని 'తిరుమణి కాప్పు' అని అంటారు. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేసిన తరువాత ఈ 'తిరుమణికాప్పు' ను స్వామివారి నుదుటన దిద్దుతారు. ఇందుకు గాను 16 తులాల పచ్చ కర్పూరం ... ఒకటిన్నర తులాల కస్తూరిని ఉపయోగిస్తారు.

ఇలా శుక్రవారం అభిషేకం అనంతరం అలంకరించిన ఈ తిరునామాన్ని గురువారం రోజు వరకూ అలాగే ఉంచుతారు. ఇక గురువారం రోజున స్వామివారి 'నేత్ర దర్శనం' వుంటుంది. అందువలన స్వామివారి నేత్రాలు పూర్తిగా కనిపించేలా తిరునామాన్ని తగ్గిస్తారు. ఆ మరునాడు శుక్రవారం అభిషేకం అనంతరం మళ్లీ 'తిరుమణి కాప్పు' ను అలంకరిస్తారు. సాధారణ రోజులకి రెట్టింపుగా బ్రహ్మోత్సవాల సమయంలో ఈ తిరునామానికి 32 తులాల పచ్చ కర్పూరం ... 3 తులాల కస్తూరిని ఉపయోగిస్తూ వుంటారు.

More Bhakti Articles