అమ్మ ఒడిలా ఆదరించే అనుగ్రహ క్షేత్రం

శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దుష్ట శక్తుల బారి నుంచి తన బిడ్డలను కాపాడటం కోసం అనేక రూపాల్లో అవతరించింది. వివిధ పేర్లతో గ్రామదేవతగా ఆవిర్భవించి ప్రతి గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలోను గ్రామదేవతగా ఓ అమ్మవారి ఆలయం కనిపిస్తూ వుంటుంది. అందుకు భిన్నంగా ఇద్దరు గ్రామదేవతలు వుండటం ... వారితో పాటు లక్ష్మీదేవి కూడా కొలువై వుండటం మనకి విజయవాడలోని 'చిట్టినగర్' లో కనిపిస్తుంది.

ఇక్కడి ఆలయంలో ప్రధాన దైవంగా లక్ష్మీదేవి ... ఆ పక్కనే గ్రామదేవతలుగా గంగాళమ్మ - ముత్యాలమ్మ దర్శనమిస్తూ వుంటారు. ఈ ముగ్గురు అమ్మవార్లు ఒకే వేదికపై కొలువుదీరి వుండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. అంటువ్యాధులు తమ ఊరు దరిదాపులకు రాకుండా ... పాడిపంటలకు ఎలాంటి లోటు రాకుండా ఈ అమ్మవార్లే రక్షిస్తూ ఉంటారని గ్రామస్తులు నమ్ముతుంటారు. అమ్మఒడి లాంటి ఈ క్షేత్రం తమ సంతాన సౌభాగ్యాలను కాపాడుతూ ఉంటుందని వాళ్లు భావిస్తూ వుంటారు.

ఈ కృతజ్ఞతతోనే ప్రతి నిత్యం అమ్మవార్లను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. ఇక్కడి అమ్మవార్లను దర్శించిన వారికి దుఃఖం దూరమవుతుందని చెబుతుంటారు. ఇక ఈ క్షేత్రంలో లక్ష్మీదేవి కొలువైన కారణంగా ఆ తరువాత కాలంలో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించడం జరిగింది. పద్మావతీ - గోదాదేవి సమేతంగా కొలువైన కోనేటి రాయుడిని దర్శించిన భక్తులు ధన్యులవుతుంటారు.


More Bhakti News