భక్తుల దాహం తీర్చిన శివుడు

భక్తుల దాహం తీర్చిన శివుడు
ఆపదలు ఎదురైనప్పుడు ... కష్టాలు పలకరించినప్పుడు ... సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఇక భగవంతుడు తప్ప తమని ఎవరూ కాపాడలేరని అనుకోవడం జరుగుతూ వుంటుంది. దేవుడిపైనే భారం వేసి ఫలితం కోసం ఆశగా ఎదురుచూస్తూ కూర్చోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులలో నిస్సహాయ స్థితిలో వున్న తన భక్తులను కాపాడటానికి దేవుడు దిగివచ్చిన సందర్భాలు ఎన్నో వున్నాయి.

ఆశ్చర్య చకితులను చేసే అలాంటి సంఘటన ఒకటి గుంటూరు సమీపంలో గల 'వేములూరి పాడు' లో జరిగినట్టుగా ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. పూర్వం ఈ ప్రాంతం చోళరాజుల ఏలుబడిలో వుండేది. ఈ ప్రాంతాన్ని పాలిస్తోన్న రాజుగారు మహా శివభక్తుడు. ప్రతి రోజూ ఆయన శివారాధన పూర్తయిన తరువాతనే, పరిపాలనా సంబంధమైన విషయాలపై దృష్టి పెట్టేవాడు.

ఒకసారి ఆయన పరిపాలనా సంబంధిత విషయాల్లో అధికారుల పనితీరును పరిశీలించడానికి అనేక గ్రామాల్లో పర్యటిస్తూ వున్నాడు. అలా ఆయన ఒక అడవీ మార్గంలో తన పరివారంతో కలిసి ప్రయాణిస్తూ వుండగా చీకటిపడింది. చాలాదూరం ప్రయాణించిన కారణంగా అందరికీ విపరీతంగా దాహం కాసాగింది. అక్కడికి దగ్గరలో ఒక బావి కనిపించడంతో, ఆశగా ... ఆత్రంగా అంతా అక్కడికి వెళ్లారు. ఆ బావిలో చుక్క నీరుకూడా లేకపొవడంతో నిరాశ చెందారు. ఉదయం వరకూ దాహం తీర్చుకోకుండా బతకడం కష్టమని ప్రాణాలపై ఆశ వదిలేసుకున్నారు.

తప్పని సరి పరిస్థితి కావడంతో రాజుగారు తమ ప్రాణాలను కాపాడమని పరమశివుడిని ప్రార్ధిస్తాడు. దాంతో ఆ బావిలో నుంచి 'జల' పుట్టి నీరు అంతకంతకు పెరుగుతూ పైకంటా చేరుకుంది. రాజుగారితో పాటు ఆయన పరివారం ఆనందంతో పొంగిపోతూ దాహం తీర్చుకున్నారు. తమ ప్రాణాలు నిలిపిన సదాశివుడికి రాజుగారు కృతజ్ఞతలు తెలపడమే కాకుండా, శివుడి మహిమకు నిదర్శనంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ స్వామియే నేడు 'జలపాలేశ్వరస్వామి' గా భక్తజనకోటిచే నిత్యనీరాజనాలు అందుకుంటున్నాడు.

More Bhakti Articles