పూజించే సాలగ్రామం పగిలితే ?

పూజించే సాలగ్రామం పగిలితే ?
సాలగ్రామాల్లో విష్ణు స్వరూపమైనవి ... శివ స్వరూపమైనవి ప్రధానంగా పూజలు అందుకుంటూ వుంటాయి. విష్ణు సంబంధిత చిహ్నం ... శివ సంబంధిత చిహ్నం వుండటం వలన ఆయా సాలగ్రామాలను గుర్తించడం జరుగుతుంది. వివిధ ఆకృతులలో ... పరిమాణాలలో ... వర్ణాలలో కనిపించే సాలగ్రామాలు అరుదుగా కొన్ని ప్రాంతాలకి చెందిన నదీ తీరాల్లో మాత్రమే దొరుకుతుంటాయి.

పరమ పవిత్రమైనవిగా ... పరమాత్ముడి స్వరూపాలుగా భావించబడుతోన్న సాలగ్రామాలు ఆలయాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. గర్భాలయంలోని దైవంతో పాటుగా సాలగ్రామాలు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాయి. సాలగ్రామాలను అభిషేకించిన జలాన్ని తలపై చల్లుకోవడం వలన సమస్తపాపాలు నశిస్తాయి. అంతే కాకుండా సాలగ్రామాలను అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన, అనేక రకాల వ్యాధుల బారి నుంచి విముక్తి లభిస్తుంది.

సాధారణంగా దేవాలయాల్లో గానీ ... ఇంటికి సంబంధించిన పూజా మందిరంలో గాని పగిలిపోయిన (దెబ్బతిన్న) దేవుడి ప్రతిమలను పూజించరాదని శాస్త్రం చెబుతోంది. అలాగే సాలగ్రామాలు కూడా దెబ్బతింటే పూజకు పనికిరావని అంటారు. దెబ్బతిన్న సాలగ్రామాన్ని పూజించడం వలన దోషం కలుగుతుందని చెప్పబడుతోంది.

ఒక్కో పరిమాణంలో ... ఒక్కో వర్ణంలో గల సాలగ్రామాలను పూజించడం వలన ఒక్కో ఫలితం వుంటుంది. అలాగే ఒక్కోవైపు దెబ్బతిన్న సాలగ్రామాన్ని పూజించడం వలన ఒక్కో వ్యతిరేక ఫలితం ఉంటుందని స్పష్టం చేయబడుతోంది. అందువలన పగిలిపోయిన సాలగ్రామం స్థానంలో కొత్త సాలగ్రామాన్ని వుంచి పూజాభిషేకాలు నిర్వహించాలి. పరిపూర్ణమైన సాలగ్రామాలే సంపూర్ణమైన ఫలితాలను ప్రసాదిస్తాయనే విషయాన్ని గ్రహించాలి.

More Bhakti Articles