ఇల్లు కట్టుకోవడానికి ముందు ?

ఇల్లు కట్టుకోవడానికి ముందు ?
జీవితంలో అందరికీ వుండే ఆశ ... ఆశయం సొంతఇల్లు కట్టుకోవడం. సొంతఇల్లు కట్టుకోవాలనే కలను నిజం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతగానో ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు స్థలం కొనగానే ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. ఇక ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉన్నవాళ్లు ముందుగా స్థలం తీసుకుని, ఆ తరువాత కొంత కాలానికి ఇల్లు కట్టుకుంటూ వుంటారు.

అయితే ఒక్కోసారి స్థలాన్ని కొని చాలాకాలం వరకూ ఇల్లుకట్టక పోవడం, అసలు ఆ స్థలం విషయాన్ని పట్టించుకోకపోవడం జరుగుతూ వుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ... ముఖ్యంగా పల్లెటూళ్లలో ఆ స్థలంలో చెట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ ప్రదేశంలో పాముల పుట్టలు సైతం ఏర్పడతాయి. ఆ ప్రదేశంలో పెరిగిన చెట్లకి పక్షులు గూళ్లు పెట్టడం ... తేనె టీగలు తేనెపట్లు పెట్టడం జరుగుతూ వుంటుంది.

ఇలా ఆ ప్రదేశం వాటికి ఆవాసంగా మారిన సమయంలో, ఆ స్థలానికి సంబంధించిన వాళ్లు అక్కడ ఇల్లు కట్టాలని నిర్ణయించుకుంటారు. పనివాళ్లను పెట్టి పుట్టలు తొలగించడం ... చెట్లు కొట్టించడం చేస్తుంటారు. స్థలాన్ని ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా శుభ్రం చేయిస్తున్నామని వాళ్లు అనుకుంటారు. అయితే ఇందుకోసం పాము పుట్టలు తొలగించడం ... పక్షుల గూళ్లు ... తేనెపట్లు గల చెట్లను కొట్టించడం దోషంగా చెప్పబడుతోంది.

తేనె టీగలు తేనెపట్లను ఖాళీ చేసినప్పుడు .. పిల్లలు పెద్దవై పక్షులు ఆ గూళ్లను ఉపయోగించనప్పుడు .. పుట్టల్లో పాము సంతతి లేదని నిర్ధారించుకున్న తరువాతనే వాటిని తొలగించాలి. ఇల్లు కట్టుకోవడానికి ముందు ఈ విషయాన్ని గురించిన ఆలోచన చేయాలి. తొందరపాటుతో వ్యవహరించి ఏ జీవరాశికి సంబంధించిన ఆశ్రయాన్ని ధ్వసం చేయకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తించినట్టయితే దోషానికి తగిన ఫలితాన్ని పొందవలసి ఉంటుందని గ్రహించాలి.

More Bhakti Articles