గోదానం వలన కలిగే ఫలితాలు

గోదానం వలన కలిగే ఫలితాలు
గోవు సకల దేవతా స్వరూపం ... సమస్త దేవతలంతా గోవులోనే కొలువై వుంటారు. ఈ కారణంగానే గోమాతను పూజించడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు తరువాత ... కన్నతల్లి తరువాత ... గో 'మాత' అని పిలిపించుకునే ఏకైన జీవి ఒక్క ఆవు మాత్రమే.

భారతీయ ఆధ్యాత్మికత అంతా కూడా గంగ .. గోవు .. గాయత్రిపై ఆధారపడి వుందని చెబుతారు. దీనిని బట్టి గోవు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి గోవును ఎవరికైనా దానం చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవిత కాలంలో మూడు గోవులను దానం చేయాలనీ, ఈ విధంగా దానం చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయని స్పష్టం చేస్తోంది.

గోవును దానం చేయడం వలన జన్మజన్మల పాపాలు హరించివేయబడతాయి. గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా మరణానంతరం 'వైతరణి' నదిని దాటే క్రమంలో అత్యంత కష్టతరమైన ప్రయాణం చేయకుండా ఈ పుణ్య ఫలం అడ్డుపడుతుంది. ఇక గోవును దానం చేయడం వలన, కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమ గతులను పొందుతారని చెప్పబడుతోంది.

ఇక కపిల గోవును అంటే నల్లని వర్ణంలో గల గోవును దానం చేయడం వలన ఈ ఫలితం మరింత త్వరగా లభిస్తుంది. గోవును దానం చేయడం వలన దారిద్ర్యం తొలగి సంపదలు కలుగుతాయి ... అనారోగ్యాలు - అపమృత్యు భయాలు తొలగిపోతాయి. సమస్యలు తుడిచిపెట్టుకుపోయి సంతోషాలు చేకూరతాయి. గోవును దానం చేసిన ఫలితం తరాలపాటు ఆ కుటుంబానికి అందుతూ, వారి క్షేమానికి కారణమవుతూ వుంటుంది.

More Bhakti Articles