మోక్షాన్ని ప్రసాదించే బ్రహ్మగుండం

శ్రీమహావిష్ణువు లోక కల్యాణం కోసం అనేక అవతారాలను ధరించాడు ... వివిధ నామాలతో పిలవబడుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీమహావిష్ణువు 'కేశి' అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ కారణంగానే అందరూ ఆయనని కేశవుడు అని పిలుస్తూ వుంటారు. అలా ఆ పరమాత్ముడు కేశవుడుగా ఆవిర్భవించిన క్షేత్రం మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోని 'ముక్కామల' గ్రామంలో దర్శనమిస్తుంది. ఇక్కడి 'బ్రహ్మగుండం' ఈ క్షేత్రానికి మరింత విశిష్టతను తీసుకొచ్చింది.
మారుమూల గ్రామం కావడం వలన ఇక్కడి క్షేత్రానికి దాని విశిష్టతకి తగిన ప్రాచుర్యం లభించలేదు గానీ, నిజానికి ఈ క్షేత్రం ఎంతో మహిమన్వితమైనదని చెప్పొచ్చు. పూర్వం కేశవస్వామికి మొగల్తూరు రాజావారు ఆలయాన్ని నిర్మించారు. ఆర్ధికపరమైన ఇబ్బందులు ఆలయ నిర్వహణకు ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేశాడు. కాలక్రమంలో అది శిధిలమవుతూ వుండగా పునరుద్ధరించారు.
మొగల్తూరు రాజవంశీకులు స్వామిని తమ ఇలవేల్పుగా భావించి పూజించేవారు. గర్భాలయంలో కేశవస్వామి నయన మనోహరంగా దర్శనమిస్తూ వుంటాడు. ఆ పక్కనేగల ప్రత్యేక మందిరంలో భూదేవి అమ్మవారు పూజలు అందుకుంటూ వుంటుంది. ఇక ఇదే ప్రాంగణంలో 'శ్రీ ఉమాసోమేశ్వరస్వామి' ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. ఈ కారణంగా ఈ క్షేత్రంలో ఇటు వైష్ణవ సంబంధిత పర్వదినాల్లోను ... అటు శైవ సంబంధిత పుణ్యదినాల్లోను ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి.
ఇక శివకేశవులు కొలువైన ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కూడా 'గుండం' ( నీటి కొలను) రూపంలో అనుగ్రహిస్తూ వుంటాడు. ఈ గుండంలో స్నానం చేసిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి బ్రహ్మ .. విష్ణు .. మహేశ్వరులను ప్రత్యక్షంగా పూజించిన ఫలితం దక్కుతుందని భక్తులు బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు.