ఉన్నచోటునే ద్వారకా కృష్ణుడి దర్శనం !

ఉన్నచోటునే ద్వారకా కృష్ణుడి దర్శనం !
ద్వారకలో కొలువైన శ్రీకృష్ణుడిని దర్శించి తరించాలనేది ఓ కృష్ణ భక్తుడి చిరకాల కోరిక. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా ఆయన ప్రయాణం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. కాలంతోపాటు కరిగిపోయిన వయసు, ఆయనకి సుదీర్ఘమైన వ్యాధిని తెచ్చిపెడుతుంది. ఆ వ్యాధితో ఆయన సతమతమైపోతూ ఉండేవాడు. ఇక ద్వారకా కృష్ణుడిని చూడకుండానే తాను తనువు చాలిస్తాననే విషయం ఆయనకి అర్థమైపోతుంది.

ఈ నేపథ్యంలోనే ఆయనకి అక్కల్ కోట మహారాజ్ గురించి తెలుస్తుంది. దత్తావతారమైన ఆయన్ని దర్శించుకున్నా చాలని అక్కడికి చేరుకుంటాడు. స్వామివారిని ఆయన దర్శించుకోగానే, బాధపడవలసిన పనిలేదనీ ... వ్యాధి తగ్గడమే కాకుండా ఆయన ద్వారక కృష్ణుడిని చూడటం కూడా జరుగుతుందని స్వామి చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోతాడు.

అక్కడికి సమీపంలో గల వేపచెట్టును చూపించి దాని ఆకులను తినమని ఆ వ్యక్తితో స్వామి చెబుతాడు. అయితే వేప ఆకుల చేదును ఆయన తట్టుకోలేకపోతూ ఉండటంతో, ఫరవాలేదు అవి తీయగానే ఉంటాయని స్వామి అనడంతో, ఒక్కసారిగా ఆయనకి వేపాకులు తియ్యగా అనిపించసాగాయి. అలా స్వామి సన్నిధిలోనే ఉంటూ ఓ వారం రోజుల పాటు కొంచెం కొంచెంగా వేపాకు తినడం వలన ఆయన వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది.

కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఆయన స్వామి దగ్గరికి రాగా, ఆయనకి ఆ స్థానంలో ద్వారకలోని కృష్ణుడు దర్శనమిస్తాడు. తన జన్మ ధన్యమైందని ఆ వ్యక్తి స్వామివారికి నమస్కరించుకుంటాడు. ఉన్నచోటునే ద్వారక కృష్ణుడి దర్శనం చేయించినందుకు స్వామివారి పాదాల చెంత సాష్టాంగపడి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియజేస్తాడు.

More Bhakti Articles