పూజామందిరంలో నంది?

పూజామందిరంలో నంది?
శివలింగాన్ని అభిషేకించడం వలన జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందువలన శివభక్తులు ఆయనకి అనునిత్యం పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం వాళ్లు వివిధ శైవ క్షేత్రాలను దర్శించినప్పుడు, అక్కడ చిన్న పరిమాణంలో గల శివలింగాలను కొనుగోలు చేస్తుంటారు. అ శివలింగాన్ని పూజా మందిరంలో వుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు.

అయితే చాలామంది శివలింగంతో పాటు నంది బొమ్మను కూడా కొంటె బాగుండేదని అనుకుంటారు. శైవ సంబంధమైన ప్రతి ఆలయంలోను శివుడికి ఎదురుగా నంది కొలువుదీరి ఉంటాడు. అలాంటిది తాము నంది ప్రతిమ లేకుండా శివలింగాన్ని పూజించడం వలన దోషం కలుగుతుందేమోనని కంగారు పడుతుంటారు. నంది ప్రతిమ లేకుండా శివలింగానికి చేసే పూజాభిషేకాల వలన పరిపూర్ణమైన ఫలితం వుండదేమోనని సందేహిస్తుంటారు.

అయితే శాస్త్రం మాత్రం పూజా మందిరంలో శివలింగం ఎదురుగా నందీశ్వరుడు లేకపోవడం వలన ఎలాంటి దోషం కలగదని చెబుతోంది. స్థిరలింగాలను గురించీ ... చరలింగాలను గురించి శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. ఆలయాల్లో ప్రతిష్ఠించబడినవి స్థిర లింగాలుగా, ఇళ్లలో పూజా మందిరాల్లో ఏర్పాటు చేయబడినవి చరలింగాలుగా చెప్పబడుతున్నాయి.

ప్రాణప్రతిష్ఠ చేయబడిన స్థిర లింగాలకు ఎదురుగా నందీశ్వరుడు తప్పనిసరిగా వుండాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే చరలింగాలకు ఎదురుగా నందీశ్వరుడు ఉండాలనే నియమమేదీ లేదని అంటున్నాయి. కనుక పూజా మందిరాలలో నందీశ్వరుడు లేకుండా శివలింగాన్ని పూజించవచ్చా ? ... లేదా ? అనే సందేహం అవసరంలేదని స్పష్టం చేస్తున్నాయి.

More Bhakti Articles