ఈ తిరగలిని దర్శిస్తే వివాహం ఖాయమా ?

ఈ తిరగలిని దర్శిస్తే వివాహం ఖాయమా ?
సాధారణంగా వివిధ క్షేత్రాలను దర్శిస్తున్నప్పుడు అక్కడ గల కొన్ని విశేషాలు మన కంట పడుతుంటాయి. వాటి గురించి తెలుసుకున్నప్పుడు సహజంగానే ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది. ఆ విశేషాల్ని విశ్వసించినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతూ వుంటుంది. అలాంటి అరుదైన అనుభూతి తిరుమల సమీపంలో గల 'నారాయణ వరం' క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు దక్కుతుంది.

పద్మావతీ దేవిని శ్రీనివాసుడు పరిణయమాడింది ఇక్కడే. నారాయణుడు వరుడుగా మారిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో 'కళ్యాణ వేంకటేశ్వరుడు' గా స్వామివారు పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడ అడుగుపెట్టివారికి దేవలోక పారిజాత వృక్షం ... స్వామివారు ఉపయోగించిన 'ఖడ్గం' తో పాటు ఒక 'తిరగలి' కూడా కనిపిస్తుంది.

పూర్వం వివిధ రకాల ధాన్యాలను విసరడానికి 'తిరగలి' ని ఉపయోగించే వారు. ధాన్యాన్ని విసురుతారు గనుక కొన్ని ప్రాంతాల్లో దీన్ని 'విసుర్రాయి' అనీ, మరికొన్ని ప్రాంతాల్లో 'తిరగలి' అని అంటూ వుంటారు. ఇక ఈ క్షేత్రంలో భద్రపరచబడిన ఈ 'తిరగలి' సాధారణమైనది కాదు. సాక్షాత్తు పద్మావతీదేవిని పెళ్లి కూతురిని చేయడంలో భాగంగా, ఆమె మంగళ స్నానానికి అవసరమైన నలుగుపిండి కోసం ఈ 'తిరగలి' ని ఉపయోగించారట. అంతటి అపూర్వమైన ఘట్టానికి గుర్తుగా ఈ తిరగలి దర్శనమిస్తూ వుంటుంది.

ఈ 'తిరగలి' ని చూడగానే అమ్మవారి పెళ్లికి సంబంధించిన హడావిడి కళ్లముందు కదలాడుతున్నట్టుగా అనిపిస్తుంది. వివాహం కావలసిన కన్యలు ఈ 'తిరగలి'ని దర్శించడం వలన, అనతికాలంలోనే వారికి వివాహం జరుగుతుందని చెబుతుంటారు. ఇందుకు అనేక నిదర్శనాలు వుండటం వలన, ఇది మామూలు 'తిరగలి' కాదనీ, మహిమాన్వితమైనదని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

More Bhakti Articles