తులసిని ఎప్పుడు కోయకూడదు?

తులసిని ఎప్పుడు కోయకూడదు?
శ్రీమహావిష్ణువు ... లక్ష్మీదేవి తులసికోటలో నివాసముంటారని పురాణాలు చెబుతున్నాయి. తులసిని పూజించడం వలన లక్ష్మీ నారాయణులను ప్రత్యక్షంగా ఆరాధించిన ఫలితం లభిస్తుంది. ఈ కారణంగానే ప్రతి ఇంట్లో ఒక తులసికోట కనిపిస్తూ వుంటుంది. ఈ తులసి కోటను అందరూ తమ ఇంట వెలసిన దేవాలయంగా భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు ... భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.

శ్రీమహావిష్ణువుకు తులసి అంటే ఎంతో ప్రీతి. అందువల్లనే ఆయనకి అనునిత్యం తులసితో పూజలు చేస్తుంటారు. తులసి లేకుండా చేసేది అసలు పూజే కాదని కూడా అంటూ వుంటారు. యుగయుగాలుగా తులసికి అంతటి ప్రత్యేకత వుంది ... పవిత్రత వుంది ... విశిష్టత వుంది. అయితే పూజ కోసమే గదా అని కొందరు తులసిని ఎప్పుడు పడితే అప్పుడు కోసేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన దోషం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.

తులసిని కొన్ని సమయాల్లో ... కొన్ని సందర్భాల్లో కోయకూడదనే విషయం కొంతమందికి తెలుసు. అయితే ఎప్పుడు కోయకూడదు అనే విషయంలో ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతూ ఉండటంతో సందేహాలు ఎక్కువౌతుంటాయి. తులసిని ఆదివారాల్లోను ... మంగళ వారాల్లోను ... అమావాస్య రోజున ... ద్వాదశి రోజున ... గ్రహణ సమయంలోను కోయకూడదని శాస్త్రం చెబుతోంది.

ఈ నియమాన్ని పట్టించుకోకపోవడం వలన పుణ్యానికి బదులుగా పాపాన్ని మూటగట్టుకోవలసి వస్తుంది. తులసిని కోయడానికి ముందు తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ... నుదుటున తిలక ధారణ చేసిన తరువాతనే తులసిని కోయడానికి ఉపక్రమించాలనే విషయాన్ని మరిచిపోకూడదు.

More Bhakti Articles