సాయి పాదాలే సకల క్షేత్రాలు

సాయి పాదాలే సకల క్షేత్రాలు
భాగోజీ షిండే అనే ఓ వ్యక్తి కుష్ఠు వ్యాధితో బాధపడుతూ వుంటాడు. వ్యాధి కారణంగా ఆయన రూపం అసహ్యంగా మారిపోవడంతో ఎవరూ కూడా ఆయన దగ్గరికి రావడానికి సాహసించని పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఆదరించే వారు లేక ... అన్నం పెట్టే వారులేక ఆయన నానాఇబ్బందులు పడసాగాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఊరు .. వాడ తిరుగుతూ శిరిడీ చేరుకుంటాడు.

ఊళ్లోకి ఆయన ప్రవేశించగానే అందరూ చీదరించుకుంటూ దూరంగా వెళ్లసాగారు. ఎవరూ ఆయన ఆకలితీర్చే ప్రయత్నం చేయకపోవడంతో నీరసించిపోతాడు. అదే సమయంలో అటుగా వస్తూ ఆ కుష్ఠు రోగిని చూస్తాడు బాబా. వెంటనే ఆయన్ని పైకి లేవదీసి మశీదుకి తీసుకువెళతాడు. ఆ వ్యక్తి ఆకలి తీర్చి ఆ రాత్రంతా ఆయనకీ సేవలు చేస్తూ గడుపుతాడు. ఓ కుష్ఠు రోగిని బాబా తాకడం ... ఆదరించడం ... సేవలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇదే అదనుగా భావించిన బాబా వ్యతిరేక వర్గం, కుష్ఠు రోగితో పాటు బాబాను కూడా ఊళ్లో నుంచి పంపించి వేయాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని గురించి మశీదు ముందు గొడవ చేయడానికి సిద్ధపడి వాళ్లు అక్కడికి చేరుకుంటారు. అదే సమయంలో నిద్రలేచిన భాగోజీ షిండే తన శరీరం పై ఎక్కడా కుష్ఠు లేకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. తన కుష్ఠు వ్యాధిని పూర్తిగా నివారించిన బాబా పాదాలపై పడతాడు.

ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు తమ కళ్ళను తామే నమ్మలేకపోతారు. బాబా భగవంతుడి స్వరూపమని వాళ్లంతా బలంగా విశ్వసిస్తారు. దాంతో ఆయన వ్యతిరేక వర్గం వాళ్లు అక్కడి నుంచి జారుకుంటారు. భాగోజీ మాత్రం తన వ్యాధిని నయం చేసి తనని నలుగురిలో తిరిగేలా చేసిన బాబా పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తాడు. సాయి పాదాలే సకల పుణ్యక్షేత్రాలుగా ... బాబా సేవయే తన జీవిత పరమార్థంగా భావించి ఆయనతో పాటే ఉండిపోతాడు.

More Bhakti Articles