లలిత ఆసనంగా శివుడు ?

లలిత ఆసనంగా శివుడు ?
శక్తి స్వరూపిణి అయిన లలితా త్రిపురసుందరీదేవిని స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. ఆ తల్లి తన భక్తులను బిడ్డలుగా భావించి వారిని సదా రక్షిస్తూ ఉంటుందని అందరూ ఆశిస్తూ వుంటారు. నిజానికి అమ్మవారు ఈ విశ్వమంతటా ఆనంద రూపమై ఆవరించి వుంటుంది. అయితే తనపై భక్తులు దృష్టి నిలపడం కోసమే ఆమె ఒక ఆకారాన్ని సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది.

అలాంటి లలితను దర్శించడం వలన ... లలితను చదవడం వలన కష్టాలు కర్పూరంలా కరిగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అమ్మవారి అనుగ్రహం కారణంగానే స్త్రీలకు సౌభాగ్యం సుస్థిరమవుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగానే అమ్మవారి ఆలయాలు ఎక్కడ వున్నా ఎప్పుడూ అవి భక్తుల రాకతో సందడిగా కనిపిస్తూ వుంటాయి.

అయితే లలితాదేవి కొలువుదీరిన కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి ఆలయాల్లో అమ్మవారు పరమశివుడిని ఆసనంగా చేసుకుని కనిపిస్తుంది. అంటే పడుకుని వున్న శివుడిపై అమ్మవారు కూర్చుని వుంటుంది. సాక్షాత్తు లయకారకుడైన శివుడిపై అమ్మవారు అలా కూర్చుని వుండటం కొంతమందిని ఆలోచింపజేస్తుంది. అమ్మవారు శివుడిని సింహాసనంగా ఎందుకు చేసుకుందోననే సందేహం వారిని వెంటాడుతూనే వుంటుంది. శాస్త్రంలో ఈ సందేహానికి చక్కని సమాధానం లభిస్తోంది.

మహాశివుడు సృష్టి .. స్థితి .. సంహార .. తిరోధాన ... అనుగ్రహ అనే అయిదు కృత్యాలను నిర్వహిస్తుంటాడు. ఈ కార్యాలను సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన శక్తిని శివుడికి ప్రసాదించేది, మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా చెప్పబడుతోంది. ఈ కారణంగానే అమ్మవారు శివుడిని అధిష్టించి కనిపిస్తుంది. శివుడిపై అమ్మవారు కూర్చుని ఉండటం శివుడి యొక్క తత్త్వాన్ని ... అమ్మవారి అనుగ్రహ రహస్యాన్ని సూచిస్తుందని గ్రహించాలి.

More Bhakti Articles