పుట్టుమచ్చలు (ముక్కు - చెవి)

'ముక్కు చివర'పుట్టుమచ్చ వున్న వారిలో ఆత్మాభిమానం ... అహంకారం రెండూ కనిపిస్తాయి. ఎటువంటి కార్యాన్నైనా సాధించుకురాగల వీరు, తమకి అడ్డు చెప్పడాన్ని అస్సలు భరించలేరు. తాము అనుకున్నదే జరగాలనే పట్టుదల కారణంగా ఒక్కొసారి చిక్కుల్లో పడుతుంటారు. ఇక స్త్రీలు ధనధాన్యాలను కలిగి వుంటారు. తమ మంచితనం కారణంగా తోటివారి ప్రశంసలు అందుకుంటారు. భర్త కారణంగాను ... సంతానం కారణంగాను వాళ్లు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

ఇక పుట్టుమచ్చ 'ముక్కు కుడి భాగాన' వున్న వారు ... తమ శక్తి సామర్ధ్యాలనే ఎక్కువగా నమ్ముకుంటారు. ముందు చూపుతో వీరు చేసిన ప్రతి పనికి ఫలితం వుంటుంది. ఈ పుట్టుమచ్చ అనుకోకుండా వీరిని శ్రీమంతులను చేసే అవకాశం లేకపోలేదు. స్త్రీల విషయంలో ఈ పుట్టుమచ్చ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వదు కానీ, ఫరవాలేదనిపించే స్థాయిలో వారి జీవితం కొనసాగేందుకు దోహదం చేస్తుంది.

'ముక్కు ఎడమ భాగాన' పుట్టుమచ్చ వున్న వారికి వ్యామోహాలు అధికంగా వుంటాయి. ఈ కారణంగా వీరు సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోతారు. ముందు జాగ్రత్తతో వ్యవహరించాలనుకున్నా ఫలితం లేకుండా పోతుంది. ఇక 'ముక్కు అడ్డకమ్మి మొదట్లో' పుట్టుమచ్చ ఉన్నవారు ... జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా భార్యా బిడ్డలతో ... సుఖసంతోషాలతో కాలంగడుపుతారు.

'చెవి'లో పుట్టుమచ్చ ... కీర్తి ప్రతిష్ఠలను ... సిరిసంపదలను సూచిస్తుంది. ఈ పుట్టుమచ్చ గలవారికి విలాసాలు ... అలంకరణలపైన మోజు వుంటుంది. ఇక ఈ పుట్టుమచ్చ చెవి రంధ్రానికి కాస్త దగ్గరగా వుంటే అధికమైనటు వంటి ఖర్చు ... అప్పుల బాధలు పీడిస్తూ వుంటాయి. ఫలితంగా సంతృప్తిలేని జీవితాన్ని గడుపుతుంటారు.

'చెవి వెనుక భాగంలో' పుట్టుమచ్చ వున్న వారు దైవభక్తి పరులై వుంటారు. కుటుంబంపట్ల ... సమాజంపట్ల బాధ్యతా యుతంగా నడచుకుంటూ వుంటారు. నేర్పుతో ... ఓర్పుతో కార్యాలను చక్క బెడుతూ సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ వుంటారు.

More Bhakti Articles