లింగమంతుల స్వామి జాతర

లింగమంతుల స్వామి జాతర
సాధారణంగా ఎవరైనా ఒక విషయం పై పట్టుపడితే ఒక మెట్టు దిగిరమ్మని మిగతా వాళ్లంతా బతిమాలుతుంటారు. ఒక మెట్టు దిగితే తమకి అవమానమని భావించే వాళ్లు అలాగే భీష్మించుకుని కూర్చుంటూ వుంటారు. కానీ భగవంతుడు అలా కాదు. తన భక్తులు కోరితే మెట్లే కాదు ... కొండలను సైతం దిగడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇలాంటి సంఘటనలకు ఎన్నో క్షేత్రాలు వేదికగా నిలిచాయి కూడా. ఆ నేపథ్యంలోనే 'దురాజ్ పల్లి' క్షేత్రం కూడా కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా సూర్యాపేట మండలంలోని ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 'పెద్దగట్టు' అనే కొండపై శివుడు లింగరూపంలో దర్శనమిస్తూ వుంటాడు. ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో స్వామిని లింగమయ్య అనీ ... లింగమంతుల స్వామి అని భక్తులు ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఈ క్షేత్రంలో స్వామి కొండ పైభాగంలోనే కాకుండా, కొండ దిగువున కూడా ఆవిర్భవించాడు. అందుకు గల కారణంగా ఇక్కడ ఓ ఆసక్తికరమైన కథనం స్థలపురాణంగా వినిపిస్తూ వుంటుంది.

పూర్వం కొండ పైభాగానికి పశువుల కాపరులు తప్ప భక్తులు పెద్దగా వెళ్లే వాళ్లు కాదట. అలాంటి పరిస్థితుల్లో స్వామి దర్శనం చేసుకోవాలనే ఆరాటంతో ఓ నిండు చూలాలు కొండపైకి చేరుకుంది. దర్శనం చేసుకున్న తరువాత కొండ దిగుతూ కొంత దూరం వచ్చాక ఆమెకి ప్రసవం కలిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. తనవంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనీ, అందుకోసం కొండ దిగిరమ్మని ఆమె శివయ్యను ప్రార్ధించిందట.

ఆమె మనవిని మన్నించిన స్వామి కొండ దిగువున కూడా వెలిశాడు. అప్పటి నుంచి కొండపైన స్వామికి కొండ దిగువున గల స్వామికి నిత్య పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. కొండపై సహజమైన కోనేరు ఉండటంతో ఈ నీటితో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు. గర్భాలయానికి చుట్టూ సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటారు. తమ మనసులో మాటని స్వామికి తెలియజేసి, నైవేద్యంగా పెరుగన్నం సమర్పిస్తారు.

ఇక్కడి స్వామిని పూజించడం వలన అనతికాలంలోనే అనుకున్న పనులు పూర్తవుతాయని భక్తుల విశ్వాసం. రెండు సంవత్సరాలకి ఒకసారి శివరాత్రి తరువాత వచ్చే పౌర్ణమికి ఐదురోజులపాటు ఇక్కడ ఘనంగా జాతర జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ జాతర మహోత్సవంలో పాల్గొని తరిస్తూవుంటారు.

More Bhakti Articles