తొందరపాటుకి ఫలితం

తొందరపాటుకి ఫలితం
పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఎవరికైనా నిండుతనాన్ని తెస్తుంది. ఎలాంటి కష్టనష్టాల్లోను తొందరపాటుని ప్రదర్శించని వాళ్లు అందరి ఆదరాభిమానాలను పొందుతూ వుంటారు. అయితే మహర్షులు ... మహనీయులు సైతం ఒక్కోసారి తమ వ్యక్తిత్వానికి భిన్నంగా నడచుకున్న సంఘటనలు లేకపోలేదు. అలాంటప్పుడు భగవంతుడు చూసీ చూడనట్టుగా ఉండలేదు. తన దృష్టిలో మహర్షులు ... మామూలు మానవులు అనే భేదమే లేదన్నట్టుగా వ్యవహరించాడు ... తొందరపడిన వాళ్లు పశ్చాత్తాపపడేలా ప్రవర్తించాడు.

ఈ విషయంలో సాక్షాత్తు వ్యాసభగవానుడికి కూడా మినహాయింపు దక్కలేదు. కాశీలో భిక్ష చేసుకునే వ్యాసుడికి ఒక రోజున ఎవరూ ఆహారాన్ని సమర్పించలేక పోతారు. వేళ దాటిపోతున్నా ఆకలి తీరకపోవడంతో, అక్కడి గృహస్తులపై వ్యాసుడుకి ఆగ్రహం కలుగుతుంది. మనుషులను అనుకుని ప్రయోజనం ఏముందీ, అన్నపూర్ణమ్మ తల్లి ఆవిర్భవించిన చోటనే ఆకలి బాధ తప్పడం లేదని తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు.

ఆ మాటలు పార్వతీ పరమేశ్వరుల మనసుకి కష్టం కలిగిస్తాయి. వ్యాసభగవానుడు అంతటి వాడు కూడా ఒక్కపూట ఆకలికి ఓర్చుకోలేక ఎద్దేవా చేస్తూ మాట్లాడటం వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాంతో వాళ్లు బ్రాహ్మణ దంపతుల రూపంలో వ్యాసుడిని భోజనానికి పిలిచి, అతిథి మర్యాదలు చేస్తూ కడుపు నిండుగా వడ్డిస్తారు. ఆ తరువాత వ్యాసుడికి నిజరూప దర్శనమిచ్చి, ఆయన తొందరపాటు వైఖరిపట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. అంతటి అసహనం కలిగిన వారికి కాశీలో స్థానం లేదని చెప్పి, ఇకపై గంగానదికి అవతల వైపు ఉండమని చెప్పారు.

దాంతో వ్యాసుడు మరే సమాధానం చెప్పలేక గంగానదికి అవతలవైపు ఉండటానికి సిద్ధపడి వెళతాడు. అయితే తన తొందరపాటు తనాన్ని తలచుకుంటూ పశ్చాత్తాపంతో చాలాకాలం పాటు ఒక ప్రదేశంలో కూర్చుని తపస్సు చేసుకున్నాడు. అందుకు గుర్తుగా ఆ ప్రదేశంలోనే ఇప్పుడు వ్యాస భగవానుడి ఆలయం కనిపిస్తూ వుంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి ఆనాటి సంఘటన కళ్లముందు కదలాడుతూ వుంటుంది ... అసహనం అనర్థాలకు దారితీస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తూ వుంటుంది.

More Bhakti Articles