స్వామి పాదముద్రల మహిమ

ఒక్క తిరుమలలోనే కాదు వివిధ పుణ్యక్షేత్రాలలో స్వామివారి పాదాలు ... అమ్మవారి పాదాలు అని చెప్పుకునే కొన్ని పాద ముద్రలు కనిపిస్తుంటాయి. కొన్ని క్షేత్రాల్లో ఒక పాద ముద్ర ... మరి కొన్ని క్షేత్రాల్లో రెండు పాదాల ముద్రలు కనిపిస్తుంటాయి. ఆ ప్రదేశంలో మాత్రమే పాదాల ముద్రలు కనిపించడం వెనుక పురాణ సంబంధమైన కథ వినిపిస్తూ వుంటుంది. ఈ పాదముద్రలను స్పర్శించిన భక్తులు, దైవాన్ని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతిని పొందుతుంటారు.

ఆయా పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకున్న ఈ పాదముద్రలు మహిమాన్వితమైనవిగా చెప్పబడుతుంటాయి. అలా ఈ పాదముద్రలకి సంబంధించిన ఓ మహిమాన్వితమైన సంఘటన కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ లో జరిగింది. ఈ క్షేత్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి ఆదివరాహ స్వామి దర్శనమిస్తుంటాడు. ఇక్కడి రాతిబండపై ఆవిర్భవించిన స్వామి జీవంతో నడిచి వెళుతున్నట్టుగా అనిపిస్తుంటాడు. అలాంటి స్వామి ఆలయ అభివృద్ధి కోసం కొంతకాలం క్రితం ఈ ప్రదేశాన్ని చదునుచేస్తూ వుండగా, ఒక నిర్ధిష్టమైన చోటు దగ్గరికి రాగానే చదునుచేసే యంత్రం ఆగిపోవడం మొదలు పెట్టిందట.

అలా ఒకటికి నాలుగుసార్లు జరగడంతో అంతా కలిసి ఆ చోటుని పరిశీలించారు. అక్కడ గల ఓ రాతి బండపై స్వామివారి పాదముద్రలు వుండటం గమనించారు. అక్కడి వరకూ రాగానే మంత్రం వేసినట్టుగా చదును చేసే యంత్రం ఎందుకు ఆగిపోతోందనేది వారికి అర్థమైపోయింది. వరాహస్వామిగా ఆవిర్భవించడానికి ముందు ఏర్పడిన పాదాల ముద్రలుగా భక్తులు వీటిని భావించి పూజిస్తూ .. తరిస్తూవుంటారు.


More Bhakti News