నృసింహ జయంతి

నృసింహ జయంతి
శ్రీ మహావిష్ణువు లోక కల్యాణార్థమెత్తిన అవతారాలలో శ్రీ నృసింహ అవతారం ఒకటి. తన భక్తులను కాపాడుతూ వుంటాననే విషయాన్ని లోకానికి చాటి చెప్పడానికి శ్రీ మహావిష్ణువెత్తిన అత్యంత శక్తివంతమైన అవతారమిది. శ్రీ రాముడు ... శ్రీ కృష్ణుడు అవతారాలవలె కుటుంబ నేపథ్యంలో కాకుండా, అప్పటికప్పుడు శ్రీ మహావిష్ణువెత్తిన మహోన్నతమైన అవతారంగా శ్రీ నృసింహ అవతారం చెప్పబడుతోంది.

నృసింహ స్వామి కృతయుగంలో వైశాఖ శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి రోజున అవతరించాడు. ఇక ఆయన ఆవిర్భావం వెనుక ఎప్పటిలానే దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ దాగుంది. వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు, ఒకసారి స్వామివారి దర్శనానికి వచ్చిన బ్రహ్మ మానసపుత్రులను అడ్డుకున్నారు. దాంతో వారు కోపించి మూడు జన్మలపాటు విష్ణుమూర్తికి విరోధులైన రాక్షసులుగా జన్మించి ఆయన చేతిలో సంహరించబడమని శపించారు.

ఫలితంగా జయవిజయులు ... 'హిరణ్యాక్ష - హిరణ్య కశిపులు'గా, 'రావణ - కుంభ కర్ణులు'గా, 'శిశుపాల - దంతవక్త్రలు'గా జన్మించారు. ఇక దితి - కశ్యపుడికి జన్మించిన హిరణ్యాక్ష - హిరణ్య కశిపుల్లో, హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు సంహరించాడు. దాంతో శ్రీ మహావిష్ణువుపై హిరణ్య కశిపుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మ దేవుని అనుగ్రహం కోసం తపస్సు చేసి తనకి మనుషులవల్ల గానీ ... జంతువుల వల్లగానీ ... పగలుగానీ ... రాత్రిగాని .. భూమిపై గానీ ... నేలపై గాని .. ఎలాంటి ఆయుధాల వలన గాని మరణం లేకుండా వరాన్ని పొందాడు.

ఇక హిరణ్య కశిపుడు తన నలుగురి కుమారులలో ఒకరైన ప్రహ్లాదుడు విష్ణు నామాన్ని జపించడాన్ని సహించలేక ఎన్నో రకాలుగా శిక్షించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. శ్రీహరి సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు చెప్పడంతో, అయితే చూపించమంటూ ఆ పక్కనే వున్న స్తంభాన్ని తన గదతో పగులగొట్టాడు.

నరుడు - సింహం కలిసిన శరీరంతో నృసింహ అవతారంలో ఆ స్తంభంలోనుంచి వచ్చిన శ్రీ మహావిష్ణువు, పగలు - రాత్రి కాని సంధ్యా సమయంలో, భూమిపై - ఆకాశంలోనూ కాకుండా తన తొడపై పడేసి ... ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించకుండా తన చేతి గోళ్లతో హిరణ్య కశిపుడిని వధించాడు. అలా లోకకల్యాణం కోసం ఆయన ఆవిర్భవించిన ఈ రోజునే 'నృసింహ జయంతి'గా జరుపుకుంటూ భక్త కోటి తరతరాలుగా తరిస్తోంది.

More Bhakti Articles