గరుడపక్షి ప్రదక్షిణలు

ప్రాచీనకాలం నాటి ఆలయాలను దర్శించినప్పుడు, అక్కడి వింతలు - విశేషాలు విన్నప్పుడు సహజంగానే ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది. తాము విన్నది నిజమేనా ? ... కాదా ? అనే సందేహం కొందరి మనసును తొలుస్తూనే వుంటుంది. మరి కొందరు మాత్రం అదంతా దైవలీలగా భావించి భగవంతుడికి నమస్కరిస్తారు.

సాధారణంగా మహిమలనేవి క్షణాల్లో జరిగిపోతుంటాయి. ఆ మహిమ వలన ప్రయోజనం పొందేవారికి సైతం అది మహిమ అనే విషయం ఆ తరువాత వరకూ తెలియదు. అందువలన ఇలాంటి మహిమల విషయంలో ఇతరులను నమ్మించడం కొంచెం కష్టమే అవుతుంది. ఇక మహిమలుగా చెప్పుకునే మరి కొన్ని ఘట్టాలు ప్రతిసారి ఒకే సందర్భంలో జరుగుతుంటాయి. ఇవి ముందుగానే తెలుస్తాయి కాబట్టి, ఆ వైనాన్ని కనులారా చూసి ఆ అనుభూతిని పొందవచ్చు.

అలాంటి మహిమాన్వితమైన సంఘటన ఒకటి 'చదలవాడ'లో జరుగుతుంటుంది. ప్రకాశం జిల్లాకి చెందిన చదలవాడ, రామాయణంలోని ఓ ముఖ్య ఘట్టానికి వేదికగా నిలిచింది. సీతాదేవిని అన్వేషించే నిమిత్తం వానరులు ఇక్కడే నాలుగు జట్లుగా విడిపోయి నాలుగు దిక్కులకు బయలుదేరారు. ఈ కారణంగానే ఈ ఊరుకి చతుర్వాడ అనే పేరు వచ్చి కాలక్రమంలో అది చదలవాడగా మారింది. అలనాటి రామాయణ ఘట్టాన్ని కళ్ళముందుంచడానికే ఇక్కడ రఘునాయకస్వామి కొలువుదీరాడు.

ప్రతియేటా ఇక్కడ సీతారాములకి అంగరంగ వైభవంగా కళ్యాణమహోత్సవం నిర్వహిస్తుంటారు. అయితే వేలమంది ఈ కళ్యాణ మహోత్సవం తిలకిస్తూ ఉండగానే, తలంబ్రాల సమయానికి ఆకాశ మార్గాన ఓ గరుడ పక్షి అందరికీ కనిపిస్తుంది. అది నేరుగా రామాలయం మీదుగా వచ్చి తీరికగా మూడు ప్రదక్షిణలు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లి పోతుంటుంది. ఇదంతా తిలకిస్తోన్న భక్తులు, గరుత్మంతుడే సీతారాముల కల్యాణాన్ని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకుని వెళ్లాడని అనుకుంటూ వుంటారు ... అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతూ వుంటారు.


More Bhakti News