కణితి భీమేశ్వర క్షేత్రం ప్రత్యేకత

కణితి భీమేశ్వర క్షేత్రం ప్రత్యేకత
పరమశివుడి నామస్మరణం చేతనే పాపాలు పటాపంచలవుతాయి. ఇక ఆయన దర్శన మాత్రం చేతనే జన్మజన్మాల పాపాలు హరించుకుపోతాయి. అలాంటి మహాదేవుడు అనేక ప్రాంతాల్లో స్వయంభువుగా ఆవిర్భవించి భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇక స్వామి స్వయంభువుగా వెలుగు చూసిన సంఘటనలు కూడా ఎంతో ఆసక్తికరంగా వినిపిస్తుంటాయి. అలాంటి నేపథ్యం కలిగిన క్షేత్రంగా మనకి 'కణితి భీమేశ్వర క్షేత్రం' దర్శనమిస్తుంది.

విశాఖ జిల్లా కూర్మన్నపాలెం సమీపంలో అలరారుతోన్న ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడికి స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి. ఫలానా ప్రదేశంలో తాను ఆవిర్భవించినట్టు ఆనవాళ్లతో సహా చెప్పాడట. మరునాడు ఉదయాన్నే ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయాన్ని వివరించాడు. దాంతో అంతా కలిసి స్వప్నంలో స్వామి చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు. ఆ ప్రదేశంలో తవ్వి చూడగా అక్కడ శివలింగం బయటపడింది. సదాశివుడి అనుగ్రహం తమ గ్రామానికి కలిగిందంటూ అంతా ఆనందంతో పొంగిపోయారు.

గ్రామస్తులంతా కలిసి స్వామివారికి ఆలయాన్ని నిర్మించి 'భీమేశ్వరుడు' అనే పేరుతో కొలవడం ప్రారంభించారు. అయితే ఈ శివలింగం పానవట్టంపై లింగాన్ని పోలిన మరో చిన్న రాయి అమరి వుండటం వలన ఇక్కడి స్వామికి 'కణితి భీమేశ్వరుడు' అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇదే పేరుతో ఈ గ్రామం కూడా ప్రసిద్ధి చెందింది. కాలక్రమంలో విశాఖ ఉక్కు కర్మాగారం విస్తరణ పనుల్లో భాగంగా ఇక్కడి నుంచి ఈ గ్రామ ప్రజలను మరో ప్రదేశానికి తరలించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని పాత కణితిగా పిలుస్తున్నారు.

ఇక్కడి శివుడు అందరి మనసులతోను పెనవేసుకుని పోయాడు కనుక, ఆయనని చూడకుండా ఈ ప్రజలు ఎక్కువ రోజులు ఉండలేరు. అనుకోని కారణాల వలన వెళ్లలేక పోతే వెంటనే స్వామి స్వప్నంలో కనిపిస్తాడని చెబుతారు. వాళ్లంతా తరచూ వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి వెళుతుంటారు. భీమేశ్వర స్వామి అనుగ్రహమే సదా తమని కాపాడుతూ ఉంటుందని వాళ్లంతా ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

More Bhakti Articles