ఆదిదంపతుల సాక్షాత్కారం

ఆదిదంపతుల సాక్షాత్కారం
మంజునాథుడు శివుడిని దూషించడం ... శివారాధనను ఖండించడం ఆయన తల్లిదండ్రులకు బాధకలిగిస్తుంది. ఇక ఆయన తీరును ఆ శివుడే మార్చాలని ఆ భారాన్ని వాళ్లు ఆయనపై వేస్తారు. అలాంటి పరిస్థితుల్లోనే మంజునాథుడు ఓ యువతిని పెళ్లి చేసుకుంటాడు. సమాజంలోని కట్టుబాట్ల కారణంగా ఆ యువతి జీవితానికి అన్యాయం జరుగుతుంటే, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులు తెలుసుకుంటారు. ఆ యువతికి శివుడంటే ప్రాణమని తెలుసుకుని సంతోషంగా ఆహ్వానిస్తారు.

భగవంతుడిపై విశ్వాసం లేని భర్త ... భగవంతుడే సర్వం అనే భార్య ... వాళ్ల కాపురం ఎలా ఉంటుందా అనే విషయం ఊళ్లో అందరికీ సందేహాన్ని కలిగిస్తుంది. భార్య ధోరణి మంజునాథుడికి తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తుంది. ఆయన పద్ధతి ఆమెకి ఆవేదనని కలిగిస్తుంది. దాంతో ఆయన తీరును మార్చవలసిందిగా ఆమె పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటుంది. ఒంటరిగా వున్న మంజునాథుడి దగ్గరికి ఆయన తల్లిదండ్రుల రూపాల్లో పార్వతీ పరమేశ్వరులు వస్తారు.

సమస్త సృష్టిని పోషిస్తూ నడిపించడంలో భగవంతుడి యొక్క పాత్రను గురించి మంజునాథుడికి ఆదిదంపతులు వివరిస్తారు. భక్తి మార్గం మానవాళి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది చెబుతారు. వాళ్లు వెళ్లిపోయాక ఆ విషయాలను గురించి ఆలోచించి అందులోని సత్యాలను మంజునాథుడు అర్థం చేసుకుంటాడు. ఇంటికి వస్తూనే తల్లిదండ్రుల పాదాలపై పడి, తన కళ్లు తెరిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు.

దాంతో వాళ్లు అయోమయాన్ని వ్యక్తం చేస్తూ జరిగింది తెలుసుకుంటారు. తాము ఎక్కడికీ రాలేదనీ ... ఆ వచ్చినది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులని చెబుతారు. తన అజ్ఞానాన్ని తొలగించడానికి ఆదిదంపతులు రావలసి వచ్చిందనే పశ్చాత్తాపంతో శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని మనసు కుదుటపడేవరకూ మంజునాథుడు ఏడుస్తాడు. పార్వతీ పరమేశ్వరుల సాక్షాత్కారం లభించినందుకు పొంగిపోతూ, భార్యతో కలిసి శివారాధనను అత్యంత భక్తి శ్రద్ధలతో జరపడం ప్రారంభిస్తాడు.

More Bhakti Articles