అండగా నిలిచే గండిపోచమ్మ

అండగా నిలిచే గండిపోచమ్మ
దేవతలకి అమృతం మాత్రమే దొరికింది ... కానీ మానవులకు అంతకు మించిన 'అమ్మ' దొరికింది. అమృతం అమరత్వాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది. కానీ మరణం వరకూ గుర్తుండిపోయే ప్రేమానురాగాలను అమ్మ మాత్రమే అందిస్తుంది. అమ్మ ప్రేమ ముందు అనంతమైన ఆకాశం అంగుళమై కనిపిస్తుంది ... అమ్మ అనురాగం ముందు వేయి పున్నమిల వెన్నెల కూడా వెలవెలబోతుంది.

అమ్మ ప్రేమను వేరెవ్వరూ అందించలేరు. మానవ లోకానికి సంబంధించి అమ్మ మనసు తెలుసుకోవడం కోసమే జగజ్జనని అయిన అమ్మవారు అనేక ప్రాంతాలలో అమ్మగా ఆవిర్భవించింది. అమ్మగా ప్రేమను అందించడంలోని ఆనందాన్ని తెలుసుకుని ఇక్కడే ఉండిపోయిందని అంటూ వుంటారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారు గ్రామదేవతలుగా అనేక ప్రాంతాల్లో కొలువై పూజలు అందుకుంటోంది.

అలా ఆ తల్లి ఆవిర్భవించిన క్షేత్రం మనకి పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండల మార్గంలో దర్శనమిస్తుంది. ప్రకృతి ప్రేమికులను పాపికొండలు మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడి కొండలు ఆహ్లాదాన్నే కాదు ... ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతుంటాయి. గజేంద్ర మోక్షం వంటి పురాణ గాధలకు ఈ కొండలు సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. అలాంటి కొండల మార్గంలో ఆవిర్భవించిన అమ్మవారు పోచమ్మ తల్లిగా పూజలు అందుకుంటోంది.

చతుర్భుజాలను కలిగివున్న అమ్మవారు విశాల నేత్రాలతో ప్రశాంతమైన మోముతో భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన, ఆపదలు ... అనారోగ్యాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అమ్మవారి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని మొక్కుబడులు చెల్లిస్తూ తరిస్తుంటారు.

More Bhakti Articles