మనసు దోచుకునే మహాదేవుడి క్షేత్రం

మనసు దోచుకునే మహాదేవుడి క్షేత్రం
మహాదేవుడు మనసున్నవాడు ... మహిమగలిగినవాడు. ఆయన ఎక్కడ వుంటే అక్కడ వరాల జల్లు కురుస్తుంది ... పుణ్యాల వరద ముంచెత్తుతుంది. అందుకే సదాశివుడు ఎక్కడ వుంటే అక్కడికి భక్తులు వెల్లువలా వస్తుంటారు. ఆ పరమశివుడికి ప్రేమతో పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలా నిత్యం భక్తులచే అభిషేకాలు స్వీకరించే ఆదిశంకరుడు మనకి కల్లూరులో కనిపిస్తాడు.

అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రం ఖమ్మం జిల్లాలో అలరారుతోంది. కాకతీయులు తమ పరిపాలనా కాలంలో అనేక శైవ క్షేత్రాలను నిర్మించారు. మరెన్నో శైవ క్షేత్రాలను అభివృద్ధి చేశారు. ప్రతి శైవ క్షేత్రంపై వాళ్లు ఆదరాభిమానాలను కనబరిచారు. ఆయా క్షేత్రాలకు అవసరమైన ధూప .. దీప .. నైవేద్యాలకు ఎలాంటి లోటు రానీయకుండా శాశ్వత ఏర్పాట్లు చేశారు. అలా వారి ఏలుబడిలో ... వారి భక్తి శ్రద్ధలకు ప్రతీకగా మనకి ఈ క్షేత్రం కనిపిస్తూ వుంటుంది.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ఆనాటి నిర్మాణ శైలినీ, ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది. ఇక ఈ ఆలయం పక్కనే రుద్రమదేవి ప్రతిష్ఠింపజేసిన వేణుగోపాలస్వామి ఆలయం కూడా దర్శనమిస్తూ వుంటుంది. రుద్రమదేవి గురించి తెలియని వారుండరు. ఆమె శౌర్యపరాక్రమాల గురించి వినని వారుండరు. అలాంటి రుద్రమదేవి పూజించిన వేణుగోపాలస్వామిని మనం దర్శిస్తున్నాం అనే ఆలోచన కలిగినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కూడా కలుగుతుంది.

ఇక్కడి కోనేరులో స్నానం చేసిన తరువాత భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. సంతాన సౌభాగ్యాలను స్వామి ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి జరిగే కల్యాణోత్సవం తిలకించేందుకు, కార్తీకమాసంలో జరిగే విశేష పూజల్లో పాల్గొనేందుకు భక్తులు విశేషమైన సంఖ్యలో తరలివస్తుంటారు ... హరిహరుల అనుగ్రహాన్ని పొందుతూ వుంటారు.

More Bhakti Articles