విష్ణుమాయ

విష్ణుమాయ
రావణాసురుడు ... మేఘనాథుడు కలిసి తమ రాజ్యంలో హరినామస్మరణ చేయడాన్ని నిషేధిస్తారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన సాధుజనులను నిర్బంధించి హింసించసాగారు. తన భార్య అయిన సులోచన కూడా శ్రీహరిని పూజిస్తోందని ఆ సమయంలోనే మేఘనాథుడుకి తెలుస్తుంది. దాంతో ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఇతరులు చెప్పేవరకూ ఆ విషయం తనకి తెలియకపోవడాన్ని ఆయన అవమానకరంగా భావిస్తాడు.

ఈ విషయమై సులోచనను నిలదీస్తాడు. ఆయనకి తెలిసిన విషయం నిజమేననీ, తాను అనునిత్యం శ్రీహరిని పూజిస్తున్నానని సులోచన చెబుతుంది. తన రాజ్యంలో శివారాధన తప్ప విష్ణు నామస్మరణం వినిపించకూడదనీ, ఇక పై విష్ణువును పూజించడం మానుకోమని మందలిస్తాడు మేఘనాథుడు.

శ్రీహరిని సేవించకుండా తాను వుండలేననీ, ఈ విషయంలో ఆంక్షలు పెట్టొద్దని సులోచన ప్రాధేయపడుతుంది. శ్రీహరి నుంచి తనని దూరం చేయవద్దని వేడుకుంటుంది. అయినా ఆమె మనవిని పట్టించుకోకుండా ఆమె పూజించే విష్ణు ప్రతిమను ధ్వంసం చేయడానికి మేఘనాథుడు ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే ఆ విగ్రహం అదృశ్యమైపోతుంది. ఆ విగ్రహం కోసం తన భవనమంతా వెతికి అలసిపోయి మరింత కోపంతో రగిలిపోతాడు.

శ్రీహరి మహా మాయావీ అనీ, ఆయనని ఆరాధించడమే ఆమె నిర్ణయమైతే తమ మధ్య ఎలాంటి సంబంధం ఉండదని చెప్పేసి విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు మేఘనాథుడు. దాంతో ఎటూ తేల్చుకోలేక సులోచన కన్నీళ్ల పర్యంతమవుతుంది. అంతలో శ్రీహరి విగ్రహం ఆమె చెంత ప్రత్యక్ష మవుతుంది. స్వామి తనకి అండగా వున్నాడనే ధైర్యంతో ఆమె కళ్లు ఆనందబాష్పాలను వర్షిస్తాయి.

More Bhakti Articles