మహిమ చూపే మారెమ్మ

గ్రామదేవతలుగా వివిధ రూపాలతో అనేక నామాలతో అమ్మవారు తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తోంది. అలా 'మారెమ్మ' పేరుతో అమ్మవారు ఆవిర్భవించిన క్షేత్రం మనకి కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలోని 'పుట్రాల' గ్రామంలో దర్శనమిస్తుంది. అమ్మవారు ఆవిర్భవించిన తీరు ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దారిలో ఎడ్లబండిపై దంపతులు వెళుతూ వుంటే ఓ స్త్రీ స్వరం వాళ్లని పదే పదే పిలవసాగిందట. మనుషులెవరూ కనిపించకపోవడంతో ఆ దంపతులు ఆ పిలుపు వచ్చిన దిశగా వెళ్లి చూడగా అక్కడ అమ్మవారి విగ్రహం కనిపించింది. దాంతో గ్రామస్తులకు ఆ విషయం తెలియపరిచి అంతా కలిసి ఆ విగ్రహానికి అక్కడే పందిరి వేసి పూజించడం ప్రారంభించారు.
కత్తి ... త్రిశూలం ... ఢమరుకం ... కుంకుమ భరిణ పట్టుకుని అమ్మవారు నాలుగు చేతులను కలిగి వుంటుంది. అమ్మవారికి కోరలు ఉన్నప్పటికీ అనురాగమూర్తిలానే కనిపిస్తూ వుంటుంది. అమ్మవారి మహిమల కారణంగానే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, ఆలయ అభివృద్ధి జరుగుతూ వచ్చింది. అమ్మవారి విగ్రహం మొదటిసారిగా చూసిన వారి వంశీకులే నేటికీ అర్చకులుగా కొనసాగుతున్నారు.
ప్రతి గురు ... ఆదివారాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఇక ఈ రోజుల్లో ఇక్కడి వాతావరణం జాతరను తలపిస్తూ వుంటుంది. అమ్మవారు చూపిన మహిమల గురించి ఇక్కడి వాళ్లు కథలు కథలుగా చెప్పుకుంటారు. కోరినవరాలను ప్రసాదించే అమ్మవారిని భక్తులు ఇలవేల్పుగా భావిస్తుంటారు ... నిరంతరం ఆ తల్లిని సేవిస్తూ తరిస్తుంటారు.