దైవానుగ్రహానికి మించినది లేదు

దైవానుగ్రహానికి మించినది లేదు
పోతన భాగవత రచన పూర్తి కావొస్తుంది. దానిని రాజుగారికి అంకితం చేయడం వలన సంపదలు పొందవచ్చని చెబుతాడు ఆయన బావమరిది అయిన శ్రీనాథుడు. రఘురాముడికే తప్ప దానిని మానవమాత్రులకు అంకితం ఇవ్వననీ, తాత్కాలికమైన సుఖాలను ఇచ్చే సంపదలు తనకి అవసరం లేదని ఆయనతో చెబుతాడు పోతన. దాంతో ఆయన అహం దెబ్బతింటుంది.

పేదరికం ఎలాంటి అవమానాలకు కారణమవుతుందనేది పోతనకి తెలిసేలా చేయాలనీ, అప్పుడే ఆయన మనసు మార్చుకుంటాడని శ్రీనాథుడు భావిస్తాడు. ఆ తరువాత కొంత కాలానికి శ్రీనాథుడు తన అగ్రహారికులతో కలిసి రాచనగరు నుంచి బయలుదేరుతాడు. అలా వెళుతూ వెళుతూ పల్లకీలో శ్రీనాథుడు ... ఎడ్లబళ్లలో ఆయన పరివారం పోతన ఇంటి దగ్గర ఆగుతారు. అందరూ ఆకలితో ఉన్నారనీ ... భోజనాలు ఏర్పాటు చేయమని పోతనతో చెబుతాడు శ్రీనాథుడు.

దాంతో పోతన భార్య కంగారు పడిపోతుంది. వచ్చిన వాళ్లకి వండి వడ్డించడానికి ఏమీలేవనీ, ఏంచేయాలో పాలుపోవడం లేదని భర్త దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అతిథుల ముందు నవ్వులపాలు అవుతామంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అన్నింటికీ ఆ రాముడే ఉన్నాడని ఆమెకి పోతన ధైర్యం చెబుతాడు. వచ్చిన వాళ్లంతా భోజనాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఇంట్లో పోయ్యికూడా వెలిగించక పోవడాన్ని శ్రేనాథుడు గమనిస్తూనే వుంటాడు.

అంతలో వంట గదిలో ఏదో శబ్దం రావడంతో పోతన భార్య లోపలికి వెళ్లి చూస్తుంది. వివిధ రకాల వంట పదార్థాలు సిద్ధంగా వుండటం చూసి ఆశ్చర్యపోతుంది. ఆ దంపతులు శ్రీరామచంద్రుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుని అతిథులకు కడుపునిండుగా వడ్డిస్తారు. వాళ్లంతా ఆ దంపతులను మనస్పూర్తిగా ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరుతారు. శ్రీనాథుడు పైకి ఏమీ మాట్లాడకపోయినా, పోతన నిజభక్తిని మనసులో మెచ్చుకోకుండా వుండలేకపోతాడు.

More Bhakti Articles