ఎండల మల్లికార్జునుడు

భక్తులను అనుగ్రహించడం కోసం సదాశివుడు భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. లింగరూపంలో ఆయన వెలసిన ఒక్కో క్షేత్రం ... ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని అలరారుతున్నాయి. అలాంటి పుణ్య క్షేత్రాల్లో 'రావివలస'ఒకటి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో వెలసిన ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన అతి పెద్ద శివలింగం ... మహా శివుడు అనే పేరుకు తగినట్టుగా ఉందనిపిస్తుంది.

20 అడుగుల పొడవు గల ఈ శివలింగం ... మల్లికార్జున స్వామి పేరుతో పూజలు అందుకుంటోంది. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరి కనిపిస్తుంటాడు. రావణ సంహారం అనంతరం సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వెళుతూ, ఇక్కడి మల్లికార్జునస్వామిని పూజించినట్టు చెప్పుకుంటారు. అజ్ఞాత వాసంలో పాండవులు ఇక్కడి గుహల్లో తలదాచుకుంటూ, మల్లికార్జునస్వామిని అర్చించినట్టు స్థల పురాణం చెబుతోంది.

కొన్ని వందల సంవత్సరాలుగా ఈ శివలింగం ఎలాంటి మందిరాలు ... మంటపాలు లేకుండా ఆరుబయట ఉండిపోయింది. 1870 ప్రాంతంలో టెక్కలి జమీందారు ... స్వామివారు ఎండకి ఎండుతూ ... వానకి తడుస్తూ వుండటం చూడలేక ఆయనకి ఆలయాన్ని నిర్మించాడు. అయితే కాలక్రమంలో అది కూలిపోయింది. ఆ తరువాత ఆ ఊరి పెద్ద ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి ప్రయత్నించగా, స్వామివారు కలలో కనిపించి తనని ఆరుబయటే వుండనీయమనీ ... అదే తనకి ఇష్టమని చెప్పాడట. ఎండలో ఉండటానికే ఇష్టపడిన కారణంగా అంతా ఆయనను 'ఎండల మల్లికార్జునుడు'అని పిలుస్తుంటారు. కార్తీక మాసంలో భక్తులు ఇక్కడికి విశేష సంఖ్యలో వచ్చి ఆయనను దర్శించి ధన్యులు అవుతుంటారు.


More Bhakti News