సంతాన ఆంజనేయ క్షేత్రం

సంతాన ఆంజనేయ క్షేత్రం
అభయాన్నిచ్చి ఆపదలను తొలగించడంలో ఆంజనేయస్వామి ముందుంటాడు. ఆయన మహా శక్తిమంతుడు కావడం వలన దుష్ట ప్రయోగాలను తిప్పికొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక శనీశ్వరుడికి కూడా ఆయన తన శక్తి సామర్థ్యాలు చూపించాడు కనుక, ఆయన భక్తులకి శని దూరంగా ఉంటాడని చెబుతుంటారు. అలాగే ఆంజనేయస్వామి అనుగ్రహం వుంటే సంతానం కలుగుతుందని కూడా అంతా భావిస్తుంటారు.

ఈ కారణంగానే సంతానం కోసం ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ... సేవిస్తూ వుంటారు. ఇక తమ కోరికను నెరవేర్చిన స్వామికి కృతజ్ఞతా పూర్వకంగా మొక్కుబడులు చెల్లిస్తుంటారు. అయితే మొక్కుబడిగా స్వామికి ఆలయాలు నిర్మించిన భక్తులు కూడా లేకపోలేదు. అలాంటి ఆలయమే మనకి నల్గొండ పట్టణంలో కనిపిస్తుంది.

ఈ పట్టణంలో చారిత్రక నేపథ్యం గల ఎన్నో ఆలయాలు దర్శనమిస్తూ వుంటాయి.అలాంటి ఈ ప్రాంతంలో ఈ ఆలయం అలరారుతూ వుండటం విశేషం. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు సంతానం కోసం స్వామిని ఆరాధించసాగాడు. ఓ రోజున ఆయన కలలో స్వామి కనిపించి, ఆయన కోరికను నేరవేర్చుతాననీ, అయితే అందుకు కృతజ్ఞతగా తనకి ఆలయం నిర్మించమని చెప్పాడట.

అనతికాలంలోనే ఆయనకి సంతానం కలగడంతో, స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. ఆనాటి నుంచి ఇక్కడి స్వామిని భక్తాంజనేయుడిగా ... సంతాన ఆంజనేయుడిగా పిలుస్తుంటారు. సంతానలేమితో బాధపడుతున్న వారు ఇక్కడి స్వామిని దర్శించి సేవిస్తుంటారు. ప్రతియేటా హనుమజ్జయంతి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు.

More Bhakti Articles