శివకోటి దర్శనం

పరమశివుడి అనుగ్రహమే వుంటే పుణ్యాలరాశి నుంచి కోరినంత కొలుచుకోవచ్చు. సంపదలు ... సౌఖ్యాలు మొదలు మోక్షం వరకూ మొహమాటం లేకుండా పొందవచ్చు. అందువల్లనే శివుడిని అంతా ఇష్టపడుతుంటారు ... ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తుంటారు. సాధారణ మానవులు ... మహర్షులు మాత్రమే కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ రామచంద్రుడు సైతం శివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు.

రావణాసురుడిని వధించిన పాపానికి పరిహారంగా శ్రీరామచంద్రుడు శివలింగాలను ప్రతిష్ఠించి పూజించాడు. అలా శ్రీరాముడు కోటి శివలింగాలను ప్రతిష్ఠించగా నేడు అవి పరమ పవిత్రమైన శైవ క్షేత్రాలుగా అలరారుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శనమిచ్చే విశిష్టమైన క్షేత్రమే 'శివకోటి'. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలలో ఇది చివరిదని చెబుతారు. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి శివకోటి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది 'శివకోడు' గా మార్పు చెందింది.

గ్రామీణ నేపథ్యంలో ఆలయం చక్కగా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తూ వుంటుంది. సువిశాలమైన ఆలయం ... అందమైన నగిషీలు కలిగిన మంటపాలు భక్తుల మనసు దోచుకుంటాయి. గర్భాలయంలోని శివలింగాన్ని దర్శించగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ శివలింగం చుట్టూ చల్లదనం వ్యాపించి వుండటం విశేషంగా చెబుతారు.

ఎంతో మంది రాజులు ... సంస్థానాధీశులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగాను ... కార్తీక మాసంలోను స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడి స్వామిని పూజించడం వలన అనేక జన్మాల పాపాలు అవలీలగా నశించి పోతాయనీ, కోరిన వరాలు ప్రసాదించబడతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News