విజయాలను ప్రసాదించే విశిష్ట క్షేత్రం

విజయాలను ప్రసాదించే విశిష్ట క్షేత్రం
ఆధ్యాత్మిక వైభవం ... చారిత్రక నేపథ్యంగల క్షేత్రాలను దర్శించినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంటుంది. ఇలాంటి క్షేత్రాల్లో అడుగుపెట్టగానే ఆ కాలంలోని మహనీయులు ... వారి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు కళ్ల ముందర ఆవిష్కరించబడుతున్నట్టు అనిపిస్తూ వుంటుంది. అలాంటి సంఘటనల సమాహారాన్ని అందించే క్షేత్రం మనకి గుంటూరు జిల్లా 'కారంపూడి'లో దర్శనమిస్తుంది.

ఇక్కడ కొలువుదీరిన స్వామి శ్రీ చెన్నకేశవుడు. పల్నాడు ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రం పేరు వినగానే, పల్నాడు యుద్ధం ... బ్రహ్మనాయుడు పోషించిన పాత్ర స్మృతి పథంలో మెదులుతాయి. ఆనాటి యుద్ధపు ఆనవాళ్లను పరిచయంచేసే ఇక్కడి చెన్నకేశవస్వామి ఆలయం బ్రహ్మనాయుడు నిర్మించినదే. బ్రహ్మనాయుడు అనునిత్యం చెన్నకేశవస్వామిని ఆరాధించేవాడు ... సదా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు.

తనకి వీరత్వాన్ని ... విజయాలను ప్రసాదించినది ఆ స్వామియేననే బలమైన విశ్వాసం బ్రహ్మనాయుడులో వుండేది. ఈ కారణంగానే ఆయన ఎల్లప్పుడూ చెన్నకేశవస్వామిని ధ్యానించే వాడు. ఆయన నిర్మించిన ఈ దేవాలయం ఆనాటి సంఘటనలను గుర్తుచేస్తూనే, భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, నాటి నిర్మాణ శైలికి అద్దం పడుతుంటుంది. గర్భాలయంలో రాజ్యలక్ష్మీ సమేత శ్రీ చెన్నకేశవస్వామి దర్శనమిస్తూ వుంటాడు.

ఆలయ మంటపంలో బ్రహ్మనాయుడు ... ఆయన ముఖ్య అనుచరులు వాడిన ఆయుధాలు కనిపిస్తాయి. ఇక్కడి స్వామిపట్ల స్థానికులు అపారమైన అనురాగాన్ని .... అనంతమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. పర్వదినాల సమయంలో తమ ఇలవెల్పుకి ఎలాంటి లోటూ రానీయకుండగా చూసుకుంటూ వుంటారు. ఆనాటి పౌరుషానికి ... ఈనాటి ప్రశాంతతకు వేదికగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రాన్ని వెంటనే వదిలి రావాలనిపించదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles