వేదమాత వెలసిన క్షేత్రం

వేదమాత వెలసిన క్షేత్రం
వేదమాత గాయత్రీదేవి కొలువైన క్షేత్రాలు చాలా తక్కువగా కనిపిస్తూ వుంటాయి. ప్రాచీనకాలానికి సంబంధించిన ఆలయాలు పక్కన పెడితే, ఆధునిక కాలంలో ఈ అమ్మవారి ఆలయాల నిర్మాణాన్ని చేపట్టినవారు తక్కువేనని చెప్పాలి. అందుకు ప్రధాన కారణం అమ్మవారి సన్నిధిలో ఆచరించవలసిన నియమనిష్టలేనని చెప్పొచ్చు. ఆలయ నిర్మాణంలోను ... అమ్మవారి దర్శనంలోనూ అత్యంత శ్రద్ధగా నియమాలను పాటించవలసి వుంటుంది.

ఈ కారణంగానే చాలామంది గాయత్రీదేవి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడానికి ఆలోచిస్తుంటారు. ఇక సంఖ్యాపరంగా తక్కువగానే ఉన్నప్పటికీ అమ్మవారు కొలువుదీరిన క్షేత్రాలు ఎంతో ప్రత్యేకతను ... విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాల్లో రంగారెడ్డి జిల్లాలోని 'మొయినాబాద్' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి గాయత్రీదేవి ఆలయంలోకి అడుగుపెడితే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.

అందమైన ఉద్యానవనం మధ్యలో మనోహరంగా ఈ ఆలయం తీర్చిదిద్దబడింది. ఎటు చూసినా పచ్చదనం ... ప్రశాంతత ఈ ఆలయానికి అలంకారాలుగా కనిపిస్తూ వుంటాయి. సౌందర్యభరితమైన నగిషీలతో తీర్చిదిద్దబడిన ఈ ఆలయం, ఎవరి మనసులనైనా ఇట్టే కట్టిపడేస్తుంది. గర్భాలయంలోని చలువరాతి మూలమూర్తి భక్తుల హృదయాలను భారీగా దోచేస్తుంటుంది. ఓ భక్తురాలికి కలలో కనిపించి, తనకి ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని అమ్మవారు ఆదేశించిందనీ, ఫలితంగానే ఇక్కడ ఈ ఆలయం ఆవిర్భవించిందని అంటారు.

విశేషమైన పుణ్య తిథుల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన ఆపదలు ... అనారోగ్యాలు తొలగిపోతాయని అంటారు. సమస్యలు సమసిపోయి సంపదలు కలుగుతాయని చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ ప్రాంత వాసులు అమ్మవారిని ఇలవేల్పుగా భావించి పూజిస్తుంటారు.

More Bhakti Articles