కేతకీ సంగమేశ్వర క్షేత్రం

కేతకీ సంగమేశ్వర క్షేత్రం
బ్రహ్మదేవుడి కోరిక మేరకు పరమ శివుడు వెలసిన పవిత్రమైన పుణ్య క్షేత్రమే 'కేతకీ సంగమేశ్వర క్షేత్రం'. ఇది జహీరాబాద్ సమీపంలోని 'ఝరా సంఘం'లో భక్తుల పూజలు అందుకుంటోంది. ఇక్కడి క్షేత్రానికి ఈ పేరు రావడానికి గల కారణం మనకి స్థల పురాణంలో కనిపిస్తుంది. కృతయుగంలో 'కేతకి' అనే అప్సరస శివుడి శాపం కారణంగా భూలోకంలో 'వన రూపం' పొందింది. తాను భూలోకాన అవతరించి కేతకీ పుష్పాలతో పూజలు అందుకుంటాననీ, అప్పుడామెకి శాపవిమోచనం కలుగుతుందని శివుడు చెప్పాడు.

ఆ తరువాత కేతకీ వనంలో శివుడి కోసం బ్రహ్మ తపస్సు ఆచరించి అక్కడ ఆవిర్భవించ వలసిందిగా కోరడంతో 'బాణలింగ' రూపంలో వెలిశాడు. ఇక ఈ క్షేత్రంలో అష్ట తీర్థాల సంగమం జరిగుతుంది కాబట్టి, ఇక్కడి స్వామి' కేతకీ సంగమేశ్వరుడు'గా ప్రసిద్ధి చెందాడు. శౌనకాది మహర్షులు యజ్ఞ యాగాదులు నిర్వహించిన ఈ క్షేత్రంలో, 'అమృత కుండం'ఎంతో మహిమాన్విత మైనదిగా చెబుతారు. దీనిలో స్నానమాచరించడం వలన, చర్మ సంబంధ వ్యాధులు నశిస్తాయని అంటారు.

ఇక్కడ స్వామివారికి అభిషేకాలు ... అమ్మవారికి కుంకుమ పూజలు విశేషంగా జరుగుతుంటాయి. శ్రావణ ... కార్తీక మాసాల్లో విశేష పూజలు, మాఘబహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకూ 'నవాహ్నిక బ్రహ్మోత్సవాలు' నిర్వహిస్తుంటారు. కన్నుల పండువగా జరిగే ఈ ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు.

More Bhakti Articles