తీవ్ర సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్ల మహిళ ఉద‌రం నుంచి 6 కిలోల ఫైబ్రాయిడ్‌ను తొల‌గించిన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు

Related image

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 6,

 2022: న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు తీవ్రమైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న 50 ఏళ్ల మ‌హిళ ఉద‌రం నుంచి 6 కిలోల ఫైబ్రాయిడ్‌ను తొల‌గించిన‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. గ‌ర్భాశ‌య ముఖ‌ద్వారం వ‌ద్ద మొద‌లైన ఈ భారీ ఫైబ్రాయిడ్‌.. మొత్తం గ‌ర్భాశయాన్ని నొక్కేస్తూ, దానివ‌ల్ల తీవ్ర‌మైన న‌డుంనొప్పి కూడా క‌ల‌గ‌జేస్తోంది.
 
నిజాంపేట‌కు చెందిన 50 ఏళ్ల మహిళ తీవ్ర‌మైన న‌డుంనొప్పి రావ‌డంతో నొప్పి నివార‌ణ మందుల కోసం ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. తొలుత అల్ట్రాసౌండ్ స్కానింగ్, త‌ర్వాత సీటీస్కాన్ చేస్తే లోప‌ల భారీ ఫైబ్రాయిడ్ ఉన్న‌ట్లు తెలిసింది. అందులో ఘ‌న‌, ద్ర‌వ ప‌దార్థాలు రెండూ పేరుకుపోయాయి.
 
రోగి ప‌రిస్థితి, ఆమెకు అందించిన చికిత్స గురించి ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రుల క‌న్సల్టెంట్ ఆబ్స్టెట్రిక్స్, గైన‌కాల‌జిస్టు, లాప్రోస్కొపిక్స‌ర్జ‌న్ డాక్ట‌ర్ శిరీషా ముళ్ల‌మూరి మాట్లాడుతూ, “రోగి శ‌రీరంలో ఫైబ్రాయిడ్ ఉన్న ప్ర‌దేశాన్ని బ‌ట్టి, ఆమెకు శ‌స్త్రచికిత్స చేయ‌డం చాలా సంక్లిష్ట‌మైన‌ద‌ని మేం భావించాం. అయితే, స‌ర్జిక‌ల్ ఆంకాల‌జిస్టు, ఎనెస్థెటిస్ట్, ఇత‌ర స‌హాయ సిబ్బంది అంద‌రూ మేము ఒక టీం గా అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉద‌రాన్ని తెరిచి, ఫైబ్రాయిడ్‌ను తొల‌గించాం.”
 
“ఈ భారీ ఫైబ్రాయిడ్ అన్ని ప్రేగులు, రక్త నాళాలు, మూత్రనాళాలు, మూత్రాశయాన్ని నొక్కుతోంది. ఇది చుట్టుప‌క్క‌ల అవ‌య‌వాల‌కూ అతుక్కుని ఉంది. చుట్టూ పెద్ద రక్త నాళాలు ఉన్నాయి. దీనివ‌ల్ల శ‌స్త్రచికిత్స‌లో ర‌క్త‌స్రావం అయ్యే ప్ర‌మాదం ఎక్కువ‌. కానీ మేము శస్త్రచికిత్సను జాగ్రత్తగా చేయ‌డంతో.. తక్కువ రక్తస్రావం అయింది, చుట్టుపక్కల నిర్మాణాలు దెబ్బతినకుండా ఫైబ్రాయిడ్‌ను తొల‌గించ‌గ‌లిగాం. దాన్ని మొత్తం తీసేయ‌డంతో.. రోగికి ఇప్పుడు నొప్పి పూర్తిగా పోయింది. ఆమె ఇక సంతోషకరమైన, సాధారణ జీవితాన్ని గడుపగ‌ల‌రు” అని డాక్ట‌ర్ శిరీషా ముళ్ల‌మూరి చెప్పారు.
 
దీని గురించి ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రుల క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ ఆంకాలజిస్టు డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ సోమ మాట్లాడుతూ, “శ‌స్త్రచికిత్స మొత్త‌మ్మీద అత్యంత క్లిష్ట‌మైన అంశం.. ఆ ఫైబ్రాయిడ్‌ను విస్తృతంగా నియోవాస్క్యుల‌రైజేష‌న్ చేయ‌డం. దీనివ‌ల్ల ర‌క్త‌స్రావం అయ్యే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌. పైగా ఈ ఫైబ్రాయిడ్ మూత్ర‌కోశాలు రెండింటినీ కూడా సాధార‌ణ శ‌రీర నిర్మాణం నుంచి దూరంగా నెట్టేస్తోంది. దాంతో మూత్ర‌కోశానికి కూడా గాయ‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. కానీ, శ‌స్త్రచికిత్స‌ను అత్యంత జాగ్ర‌త్త‌గా చేయ‌డంతో, ర‌క్త‌స్రావం వీలైనంత త‌క్కువ‌గా ఉండేలా చూడ‌గ‌లిగాం. దాంతోపాటు మూత్ర‌కోశానికి ఎలాంటి గాయాలు కాకుండా చూసుకున్నాం” అని వివ‌రించారు.
 
శ‌స్త్రచికిత్స చేసిన మూడు వారాల త‌ర్వాత మూత్ర‌కోశం ప‌రిస్థితిని కూడా అంచ‌నా వేసేందుకు రోగిని మ‌రోసారి ఆస్ప‌త్రికి పిలిచి, ప‌రీక్ష‌లు చేశారు. శ‌స్త్రచికిత్స వ‌ల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బందీ లేద‌ని ఆ ప‌రీక్ష‌ల్లో తెలిసింది. రోగి ప‌రిస్థితి అంతా సాధార‌ణంగా ఉంద‌ని, ఆమె సంతోషంగా జీవిస్తున్నార‌ని తేలింది.
 

More Press Releases