వంద కోట్ల విక్రయాలే లక్ష్యంగా ఆప్కో కార్యాచరణ చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత

Related image

వంద కోట్ల విక్రయాలే లక్ష్యంగా ఆప్కో వార్షిక కార్యాచరణ సిద్దం చేయాలని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత ఆదేశించారు. సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తే చేనేత రంగంలో ఇది సాధ్యమేనని స్పష్టం చేసారు. నూతనంగా చేనేత జౌళి శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సునీత బుధవారం ఆప్కో కేంద్ర కార్యాలయంలో విస్రృత స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రూ.30 కోట్ల అమ్మకాలను వంద కోట్లకు పెంచాలని నూతన జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లా నుండి అదనంగా రెండు కోట్ల విక్రయాలు సాగాలని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి జీవన ప్రమాణ స్ధాయిను పెంచాలన్న లక్ష్యాన్ని కలిగి ఉన్నారని, చేనేత వస్త్ర శ్రేణిని ప్రజలకు చేరువ చేయటం ద్వారానే ఇది సాధ్యపడుతుందని అన్నారు. నూతనంగా ఐదుగురు డివిజినల్ మార్కెటింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించి జిల్లా స్ధాయిలో ప్రభుత్వ రంగ సంస్ధల నుండి విక్రయ ఒప్పందాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహన రావు మాట్లాడుతూ ఇటీవల అత్యాధునికంగా ఎనిమిది ఆప్కో షోరూమ్ లు నూతనంగా ప్రారంభించామని, మరిన్ని షోరూమ్ ల ప్రారంభం, ఆధునీకరణ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. నూతన డిజైన్ల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి రావలసిన బకాయిల అలస్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయితే ముఖ్యమంత్రి త్వరలోనే వాటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. చేనేత, జౌళి శాఖ సంచాలకులు , ఆప్కో ఎండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం పధకాన్ని వర్తింప చేస్తున్నామన్నారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు కన్నబాబు, రాష్ట్ర మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, రమణ, అయా జిల్లాల మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.


కొండపల్లిని సందర్శించిన సునీత : చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత బుధవారం సాయంత్రం కొండపల్లిని సందర్శించి హస్త కళాకారులతో వ్యక్తిగతంగా సమావేశం అయ్యారు.  వారికి ప్రభుత్వ పరంగా ఎదురవుతున్న సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.  మరోవైపు వారు ప్రస్తుతం ఏవైనా సమస్యలు ఎదుర్కుంటున్నారా అంశంపై అరా తీసారు.  కొండపల్లి బొమ్మల తయారీపై యువతకు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ కళకు పూర్వవైభవం తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లేపాక్షి అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే అతిధులకు కొండపల్లి బొమ్మలు ఇచ్చేలా అయా ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేయాలన్నారు. చేతి వృతి దారులు రూపొందించిన అన్ని రకాల వస్తువులను లేపాక్షి కొనుగోలు చేస్తుందన్నారు. వారిని ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సునీత పేర్కొన్నారు. సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ కొండపల్లి బొమ్మలకు సహజ సిద్ధమైన రంగులను వాడాలని సూచించారు. ముఖ్య కార్యదర్శి వెంబడి లేపాక్షి ప్రత్యేక అధికారి లక్ష్మినాధ్ తదితరలు ఉన్నారు.


More Press Releases