UK: ఇక్కడ మేఘాలు పుట్టడాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు!.. జిబ్రాల్టర్​ కొండ శిఖరం వీడియోలు ఇవిగో

  • స్థానిక వాతావరణ పరిస్థితులతో ‘బ్యానర్ క్లౌడ్’ తరహా మేఘాలు ఏర్పడే అవకాశం
  • ఏడాదిలో దాదాపు ఐదు నెలల పాటు కొండ వద్ద మేఘాలు
  • చిత్రమైన ఆకారాల్లో మేఘాలు ఏర్పడటంపై సోషల్ మీడియాలో పోస్టులు కూడా..
Gibraltar clouds are formed like this

ఆకాశంలో అంతెత్తున మేఘాలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి మొత్తం ఆకాశాన్ని కప్పేసి భారీ వర్షాలు కురిపించడమూ మనకు తెలిసిందే. కానీ ఓ చోట మాత్రం ఓ పెద్ద కొండ మేఘాలకు పుట్టినిల్లుగా మారింది. ఏదో పాత్ర నుంచి నీటి ఆవిరి వస్తున్నట్టుగా.. ఆ పెద్ద కొండ నుంచి మేఘాలు పుడుతూనే ఉంటాయి. కలిసి పెద్ద మేఘంలా మారి వెళ్లిపోతాయి. ఆ తర్వాత మరో మేఘం ఏర్పడుతూ ఉంటుంది. 

అదే పెద్ద ఏక రాతి కొండ
యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ (యూకే) పరిధిలో జిబ్రాల్టర్‌ ద్వీపకల్పం ఉంది. అందులో సముద్ర తీరానికి కాస్త దూరంలో ఉన్నదే ఈ ఎత్తయిన జిబ్రాల్టర్‌ కొండ. దాదాపుగా మొత్తం ఒకే రాయితో ఏర్పడిన ఈ కొండ ఒక వైపున ఏకంగా 426 మీటర్ల (1,398 అడుగులు) ఎత్తున శిఖరం ఉంటుంది. అది సముద్రానికి అభిముఖంగా ఉండి.. అటు నుంచి వచ్చే గాలికి అడ్డుగా ఉంటుంది. ఈ క్రమంలో సముద్రం వైపు నుంచి వచ్చే గాలి ఈ కొండను తాకుతుండగా.. మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి.

బ్యానర్‌ క్లౌడ్‌ గా పిలిచే మేఘాలివి..

  • ఎక్కడైనా గాలి వీచే దిశలో పెద్ద పెద్ద పర్వతాలుగానీ, ఎత్తయిన కొండలుగానీ ఉన్నప్పుడు.. వీస్తున్న గాలి వాటికి తాకి పైకి లేస్తుంది. అలా పైకి వెళ్లినచోట తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలిలోని నీటి ఆవిరి చల్లబడి చిక్కబడుతుంది. మంచు స్పటికాలుగా మారడం మొదలై మేఘాలు ఏర్పడతాయి.
  • ఇలా పర్వతాలు, కొండల కారణంగా ఏర్పడే మేఘాలను ‘బ్యానర్‌ క్లౌడ్‌’గా పిలుస్తుంటారు. జీబ్రాల్టర్‌ కొండ వద్ద ఏర్పడే మేఘాలు కూడా ఇదే తరహావి అని బ్రిటన్‌ వాతావరణ శాఖ తెలిపింది.
  • జిబ్రాల్టర్‌ వాతావరణ పరిస్థితుల మేరకు ఏటా జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఈ చిత్రాన్ని గమనించవచ్చని స్థానికులు చెబుతున్నారు.
  • ఈ కొండ, ఈ ప్రాంతం అద్భుతమంటూ కొందరు నెటిజన్లు, తాము ఓసారి అక్కడికి వెళ్లామని, ఈ అద్భుతాన్ని చూశామని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
  • ఇక ఓ జంట అయితే తాము వెళ్లినప్పుడు ఐదు రోజులు ఉన్నామని.. ఆ ఐదు రోజులూ ఇలా మేఘం ఏర్పడి తామున్న హోటల్ పొద్దంతా నీడలోనే ఉండిపోయిందని వాపోవడం గమనార్హం.
  • ఇక ఈ కొండ నుంచి ఏర్పడే మేఘాలు ఒక్కోసారి చిత్రమైన ఆకారాల్లో ఉండటంపై.. సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు కూడా పెడుతున్నారు.

More Telugu News