Raghu Rama Krishna Raju: దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నా... రెండు మూడు దెబ్బలు కొడితే ఏదైనా జరగొచ్చు: నారాయణ అరెస్ట్ పై రఘురామకృష్ణరాజు

  • ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
  • ఖండించిన రఘురామకృష్ణరాజు 
  • కొడతారేమోనంటూ వ్యాఖ్యలు
  • జగన్, బొత్సలను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్  
Raghuram Krishnaraju condemns Narayana arrest

నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ చేయడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజికి కారణమని సీఎం జగన్ అన్నారని, కానీ మంత్రి బొత్స సత్యనారాయణ అదంతా అబద్ధం అని చెప్పారని, ఇందులో ఏది నిజం, ఏది నమ్మాలి? అని రఘురామ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నారాయణను అరెస్ట్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. 

అయితే వీరికొక అలవాటుందని, విచారణ చేపట్టే గదుల్లో కెమెరాలు తీసేస్తారని, వ్యక్తిగత సిబ్బందిని కూడా పంపించేస్తారని రఘురామ వెల్లడించారు. కొట్టడం కోసమే ఆ విధంగా చేస్తారని, ఆ తర్వాత పచ్చి అబద్ధాలు చెబుతారని ఆరోపించారు. ఇవన్నీ తన కేసులోనూ జరిగాయని, దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నానని పేర్కొన్నారు. 

కాగా, నారాయణ శారీరక దారుఢ్యం ఏ మేరకు ఉందో తెలియదు కానీ, రెండు మూడు దెబ్బలు కొడితే ఏమైనా జరగొచ్చని తెలిపారు. నారాయణ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంటనే కోర్టును ఆశ్రయించడం మంచిదని, ఈ ప్రభుత్వ పెద్దలు ఎంతవరకైనా తెగించే రకం అని రఘురామ స్పష్టం చేశారు. 

ప్రభుత్వ అన్యాయాల్ని నిలదీయడానికి ప్రజలు క్రమంగా బయటికొస్తున్నారని, ఓ సీనియర్ నేతను అరెస్ట్ చేస్తే వాళ్లందరూ భయపడతారని భావిస్తున్నారని వివరించారు. 

ఈ కేసుకు సంబంధించి నారాయణను అరెస్ట్ చేయడం న్యాయం అనుకుంటే, సీఎం జగన్ ను, బొత్సను కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యవాదులు నారాయణ అరెస్ట్ ను ఖండించాలని తెలిపారు.

More Telugu News