Jagan: రూ. 6 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న వైఎస్ జగన్!

  • నేటి నుంచి మూడు రోజుల పర్యటన
  • కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన
  • పలు భవనాలకు ప్రారంభోత్సవాలు

నేటి నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగే తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, సుమారు రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పాటు దాదాపు రూ. 15 వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు. వీటికి సంబంధించి పాలనా అనుమతులు ఇప్పటికే మంజూరు అయ్యాయి.

ఈ ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకునే ఆయన, అక్కడి నుంచి హెలికాప్టర్ లో జమ్మలమడుగు మండలం, సున్నపురాళ్లపల్లెకు చేరుకుంటారు. అక్కడే ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ఈ పరిశ్రమ కోసం ఇప్పటికే 3,148 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. నాలుగు రోజుల కిందటే రెవెన్యూ అధికారులు ఈ భూమిని అప్పగించారు. ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కడప జిల్లాలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని గతంలోని ప్రభుత్వాలు కూడా ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ముందుగా ఇచ్చిన హామీల ప్రకారం వైఎస్సార్‌ జిల్లాలో అభివృద్ధి పనులకు ఈ మూడు రోజుల్లో శ్రీకారం పడనుంది. కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులు, ఆసుపత్రులు, రహదారులు, డ్రైనేజీలు, గ్రామ సచివాలయ భవనాలు ప్రారంభం కానున్నాయి. కుందూనదిపై కుందూ – తెలుగుగంగ ఎత్తిపోతల పథకం, రాజోలి ఆనకట్ట నిర్మాణానికి, కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద నిర్మించనున్న ఆనకట్టకు సంబంధించి దువ్వూరు మండలం నేలటూరు వద్ద శంకుస్థాపన శిలాఫలకాలను జగన్ ఆవిష్కరిస్తారు.

రూ. 107 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్‌ ఆసుపత్రి భవనం, రూ. 175 కోట్లతో  నిర్మించే సూపర్‌ స్పెషాలిటీ విభాగంలతో పాటు ఉచిత అన్నదాన, వసతి భవనాన్ని ప్రారంభిస్తారు.  కడపలో డిస్ట్రిక్ట్ పోలీస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసే జగన్, ఆపై కడపలో రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.

ఆపై రేపు, 24వ తేదీ రాయచోటి సమీపంలో రూ.1,272 కోట్లతో ఎత్తిపోతల పథకాలను, ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 25వ తేదీ పులివెందులలో రూ. 347 కోట్లతో నిర్మించే మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేసి, ఇప్పటికే నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.

More Telugu News